తెలంగాణలో కరోనా వైరస్ బారిన పడి మరో టీఆర్ఎస్ నేత చనిపోయారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఆరె రాజన్న కరోనాతో మృతి చెందారు. గత నెల చివరి వారంలో రాజన్నకు కోవిడ్ నిర్ధారణ కావడంతో కొన్ని రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉన్న ఆయనను ఆదిలాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందారు.
ఆయన భౌతిక కాయాన్ని సోమవారం ఉదయం రాజన్న స్వస్థలం చాంద(టి)కి తీసుకువచ్చారు. అంత్యక్రియలకు ఆదిలాబాద్ ఎమ్యెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్యెల్యే రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, మాజీ ఎంపీ జీ నగేశ్ హాజరయ్యారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆర్టీసీ కండక్టర్‌గా విధులు నిర్వర్తించిన రాజన్న రాజకీయాల్లోకి ప్రవేశించి తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చొరవ చూపేవారని పలువురు పేర్కొన్నారు.