మండిపోతున్న టమాట ధర.. రూ.100 దాటిన కిలో టమాట...
Tomato Price Hike: రైతు బజార్లలో రూ.70.. బహిరంగ మార్కెట్‌లో కేజీ రూ.120 నుంచి రూ.160...
Tomato Price Hike: టమాట ధర దిగి రావడంలేదు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా మండిపోతుండగా, ఇప్పుడు టమాట ధర పరుగులు పెడుతోంది. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం కారణంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కన్పిస్తోంది.
కొంత కాలంపాటు నేల చూపులు చూసిన టమాట ధర.. ఇప్పుడు ఒక్కసారి పెరిగిపోయింది. మూడు నెలల కిందట కిలో టమాట 5 నుంచి 8 రూపాయల వరకు ఉంది. కానీ మండుతున్న ఎండల మాదిరిగానే టమాట ధర అమాంతం 100 రూపాయలకు చేరింది. రైతు బజార్లు, పెద్దపెద్ద మార్కెట్లలో కిలో 80 పలుకుతుంటే చిన్న చిన్న మార్కెట్లో 130 రూపాయలకు వరకు చేరింది. ప్రస్తుతం గుంటూరులోని మార్కెట్ సెంటర్ బస్ స్టాండ్ ఏరియా వంటి హోల్‌సేల్ మార్కెట్లతో పాటు ప్రధాన రైతు బజార్లలో కూడా టమాట కొరత తీవ్రంగా ఉంది.
సాధారణ రోజుల్లో నగరానికి 20 నుంచి 30 లారీలు దిగుమతి అవుతుంటే, ప్రస్తుతం రోజుకు 20 లారీలు రావడం కూడా కష్టమైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కోచోట ఒక్కోలా ధర పలుకుతోన్నా, రేటు మాత్రం గుండె గుభేల్‌మనేలా రీసౌండ్ వస్తోంది. గుంటూరు మార్కెట్‌లో కేజీ టమాటా ధర 80 రూపాయలు పలికింది. రైతు బజార్‌లో 70 రూపాయలుండగా బయటి మార్కెట్‌లో పది రూపాయలు ఎక్కువగా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కో చోట టమాటా ధర ఏకంగా 100 రూపాయిలు పలుకుతోంది. ధరలు ఈ స్థాయిలో మండిపోతుండటంతో కొనేదెట్టా అని వినియోగదారులు నిట్టూరుస్తున్నారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఏకంగా 60 నుంచి 80 రూపాయల వరకు పెరిగింది. ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ టమటా ధరలు మండిపోతున్నాయి. టమాట కొనాలంటేనే జంకే పరిస్థితి ఏర్పడింది. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కనిపిస్తోంది. దీంతో కొండెక్కిన టమాటా ధర ఈ నెలాఖరు వరకు కిందకు దిగకపోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు.