విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న ఆలయ ప్రాంగణం

Update: 2020-09-19 10:00 GMT

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమైంది. కరోనా నేపథ్యంలో ఈయేడు ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో లాగా హంగు ఆర్బాటం లేకుండా నిరాడంబరంగా ఉత్సవాలను నిర్వహించనుంది టీటీడీ. ఆలయంలోపలే స్వామి వారి ఉత్సవ ఊరేగింపు సేవలు చేయనున్నారు. దీంతో అలంకరణలు కూడా ఆలయానికే పరిమితం చేశారు అధికారులు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల కొండ ముస్తాబైంది. ఉత్సవాల నేపథ్యంలో ఏడుకొండలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నారు టీటీడీ అధికారులు. ఆలయ ప్రాంగణమంతా విద్యుద్దీపాలతో అలంకరించారు. ప్రధాన గోపురంతోపాటు ఇతర ఆలయాలకు మెరుగులు దిద్దారు. ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలోనే ఉత్సవాలను నిర్వహిస్తుండటంతో అలంకరణలను ఆలయంకే పరిమితం చేశారు అధికారులు. ఇక ఆలయ తిరుమాడ వీధులను రంగుల హరివిల్లులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు.

తిరుమల బ్రహ్మోత్సవమంటే తిరుపతి మొదలు తిరుమల దాకా విద్యత్ దీప కాంతులు విరాజిల్లేవి. స్వామివారి వైభవాన్ని తెలియజెప్పే ఎన్నో రూపాలతో ఫల,పుష్ప ప్రదర్శనలు ఉండేవి. సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే కళా ప్రదర్శనలుండేవి. కానీ ఈ సారి అవేమీ లేవు. అయితే ప్రధాన కూడళ్లలో మాత్రం ఎల్.ఈ.డి సీరియల్ సెట్స్ ఏర్పాటు చేశారు. గతంలో స్వామివారు మాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చేవారు. వేల మంది భక్తులు స్వామివారి స్వరూపాన్ని దర్శించుకునే వారు. కానీ ఈ ఏడాది భక్తులకు అనుమతి లేకపోవడంతో మాడ వీధుల్లో ఆ హంగు కనిపించటం లేదు.

స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల్లో 16 వాహనాలపై శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. నేడు శ‌నివారం ధ్వజారోహ‌ణంతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా అదే రోజు రాత్రి 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు పెద్ద శేషు వాహనంపై శ్రీవారు దర్శనమిస్తారు. 20వ తేదీన చిన్నశేష వాహ‌నం, హంసవాహన సేవలు జరగనున్నాయి. 21న సింహ, ముత్యపుపందిరి వాహ‌నాలపై దర్శనమిస్తారు.

23న రాత్రి 7 గంటల నుంచి గ‌రుడ‌సేవ‌ జరగనుంది. 27న పల్లకి ఉత్సవం, తిరుచ్చి ఉత్సవాలు జరుపుతారు. అదే రోజు జరిగే చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ యేడాది బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో కూడా టీటీడీ మార్పులు చేసింది. ఈ ఏడాది పాత పద్ధతి ప్రకారం గరుడ సేవ నాడు సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నెల 23న జరిగే గరుడసేవలో పట్టువస్త్రాలు సమర్పించి మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Tags:    

Similar News