సృష్టిలో ప్రతి ప్రాణికి సముచిత స్థానం ఉంది. పులికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. పులి రాజసానికి, ఠీవీకి ప్రతీక. దాని కళ్ళల్లో భయానకం, నడకలో గాంభీర్యం చూస్తేనే వణుకు పుడుతోంది. అలాంటి పులుల సంఖ్య తగ్గిపోతుంది. అడవుల్లో స్వేచ్ఛగా సంచరించే పులులు భయంతో వణుకుతున్నాయి. వేటగాళ్ల తుపాకులు ఎక్కడ గర్జిస్తాయో ఏ వైపు నుంచి తూటాలు దూసుకొస్తాయో ఏ ప్రాంతంలో ఏ ఉచ్చు ఉందో తెలియక అల్లాడిపోతున్నాయి. దేశంలో పులుల సంఖ్య పెంచటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంటే మరో వైపు పులులను వేటాడే వారు పెరిగిపోతున్నారు. టైగర్ జోన్స్ పై ఉన్న నిబంధనలు తుంగలోకి తొక్కి పులులను వేటాడి వదిస్తున్నారు.
పులి చర్మం, గోళ్లు అత్యంత ఖరీదు. పులి మాంసం కూడా ఖరీదే. దీంతో పులలపై వేటగాళ్లు పంజా విసురుతున్నారు. వేటగాళ్ల అరాచకాలు అడ్డుకోవాల్సిన అటవీ సిబ్బంది చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వేటగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల వేట జోరుగా సాగుతోంది.
నల్లమల అడవుల్లో పులుల పరిస్థితి దినదినగండంగా మారింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వేటగాళ్ల పాలిట వరంగా మారింది. ఈ సమయంలో వేటగాళ్లు రెచ్చిపోయి వేట సాగించారు. ఇప్పటికీ శ్రీశైలం సమీపంలో అధికారుల తనిఖీల్లో పులి చర్మాలు, గోర్లు పట్టుబడుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల వేట సాగుతున్నట్లు అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. పులుల సంతతి పెరిగేందుకు నల్లమల అటవీ ప్రాంతం చాలా అనువైయింది. ఇదే ఇక్కడ పులుల సంఖ్య పెరిగేందుకు దోహదపడుతోంది. కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల వరకు ఈ అటవీ ప్రాంతం విస్తరించి వుంది. అయితే ఇక్కడ పులుల సంఖ్య ఎలా పెరుగుతోందో అంతే స్థాయిలో వేట పెరిగిపోతోంది. దేశంలో ఎక్కడ పులుల సంతతి పెరుగుతోందో అటవీ శాఖ అధికారుల కంటే వేటగాళ్ళ వద్దనే ఖచ్చితమైన లెక్కలు ఉన్నాయి.
నల్లమల అటవీ ప్రాంతం నుంచి తిరుపతి శేషచలం అటవీ ప్రాంతం వరకు పులులు సంచారిస్తూ జీవనం సాగిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతాన్ని టైగర్ కారిడార్ గా అధికారులు ప్రకటించారు. ఎన్. ఎస్. టీ. ఆర్... పరిధిలోని ఆత్మకూరు, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల డివిజన్‌లలో పులుల పునర్ ఉత్పత్తి అధికంగా ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు చెపుతున్నారు.
ఆత్మకూరు డివిజన్ లో అనుమానాస్పద పరిస్థితిలో రెండు ఆడ పులులు 2018లో మృతి చెంది కనిపించాయి. మరో వైపు వెలుగోడు అటవీ ప్రాంతంలో ఓ ఆడపులి జాడ కనిపించకుండా పోయింది. 2014లో దోర్నాల ఐన ముక్కాల గ్రామంలోని ఓ ఇంట్లో రెండు పులి చర్మాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక 2020 డిసెంబర్ 27న శ్రీశైలం ప్రాజెక్ట్ సమీపంలోని బయో డైవర్శిటీ ల్యాబ్ దగ్గర ఓ చిరుత కాళేబరం లభ్యమయింది. శ్రీశైలం నల్లమల అటవీ సమీపంలోని హఠకేశ్వరం ప్రాంతంలో వన్య ప్రాణుల స్మగ్లింగ్ ముఠాను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వేటగాళ్ల ఆట కట్టించటానికి కేంద్రం కూడా ప్రత్యేక దళాలను రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా వన్యప్రాణుల పట్ల ప్రేమగా ఉండటం అవసరం. అవి మన సంపద, వాటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. అటు ప్రజలకు, ఇటు వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా ఈ సమస్యను పరిహరించడంలో ప్రభుత్వాలు చొరవ ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.