Chandrababu: ఏపీలో సంచలనంగా చంద్రబాబుకు ఐటీ నోటీసుల వ్యవహారం
Chandrababu: నోటీసుల ఆరోపణలపై వ్యూహాత్మక మౌనం పాటిస్తోన్న టీడీపీ
Chandrababu: చంద్రబాబుకి ఐటీ నోటీసుల వ్యవహారం ఏపీలో రాజకీయ సంచలనంగా మారింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబుపై అక్రమ మార్గంలో ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు పెను సంచలనంగా మారాయి. ఇప్పుడు ఇదే అంశం ఆ పార్టీని ఇరకాటంలో పెట్టిందనే చర్చ నడుస్తోంది. చంద్రబాబు తన పాలన సమయంలో ఓ కంపెనీ నుంచి 118 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్లు తాజాగా ఆరోపణలు వచ్చాయి. ఆ డబ్బులకు సంబంధించిన లెక్కల పైనే ఇప్పుడు ఐటీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.
ఇక చంద్రబాబుకు ఐటీ నోటీసులపై అధికార వైసీపీ మాటల దాడికి దిగింది. అమరావతి రాజధాని పేరుతో గత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ నుంచి చంద్రబాబుకి నోటీసు వచ్చిన మాట వాస్తవమా, కాదో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి పేరుతో ముడుపులు తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఓ ప్రముఖ ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన కథనాన్ని పేర్ని నాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతేడాది సెప్టెంబర్‌లోనే నోటీసు ఇచ్చినా ఎందుకు దాని గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు లంచాల బాగోతం బట్టబయలైందని విమర్శించారు.
అయితే ఈ నోటీసుల వ్యవహారంపై చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. ఎన్నికలు సమీపిస్తున్నాయనే మళ్లీ తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎన్నోసార్లు విచారణ చేసినా, ఏమీ చేయలేకపోయారని తెలిపారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సమాధానం చెప్పమంటూ వైసీపీ నేతలను ఇన్ డైరెక్ట్‌గా రిప్లయ్ ఇచ్చారు. నిప్పులా పనిచేస్తామంటూ సవాల్ చేశారు. ఇక ఐటీ నోటీసుల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరలేపింది.