మరో పార్టీలో గంట మోగడం ఖాయమేనా?

Update: 2019-06-22 09:46 GMT

ఆయన ఏ పార్టీలో ఉన్నా, గంట మోగాల్సిందే. గెలుపు గంట మార్మోగాల్సిందే. మంత్రి పదవి గంట హోరెత్తాల్సిందే. లేదంటే గంట మరో పార్టీలో ఘొల్లుమంటుంది. ఈసారి కూడా గంట మోగింది. కానీ శబ్దమే లేదు. గంట మోగించడం బాగా అలవాటైన ఆయనకు, ఏ పార్టీలో మోగించాలో అర్థంకాక ఇప్పుడు తంటాలు పడుతుత్నాడట. గంట మోగిస్తానంటూ ఒక పార్టీ తలుపు వాకిట నిలిచినా, ఆ తలుపు మాత్రం తెరుచుకోవడం లేదట. అయితేనేం మరో పార్టీ తలుపు దగ్గర గంటను గట్టిగా పట్టుకుని మార్మోగిస్తానంటున్నాడట. గంట గంటకు గంట మోగించేలా ఉన్న ఆయనెవరో మీకిప్పటికే అర్థమై ఉంటుంది కదా. యస్. ఆయన గంటా శ్రీనివాస రావు. మరి ప్రస్తుతం ఆయనకొచ్చిన తంట ఏంటంట ఏ పార్టీలో మోగించాలని ఉబలాటపడుతున్నాడట....?

రాజకీయ నేతలంతా రాజకీయాలు చేస్తుంటారు. కానీ గంటా మాత్రం రాజకీయాలతోనే ఆటలాడుకుంటారు. అదేంటో గంటా పొలిటికల్ స్టైలే వేరు. ఎన్నికలొస్తే చాలు నియోజకవర్గాన్ని మార్చేస్తుంటారు. కుదిరితే పార్టీని కూడా చేంజ్ చేస్తారు. ఈసారి కూడా ఎప్పటిలా సీటు మార్చేసారు. కానీ అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తూ ఈ సారాయన పార్టీని మాత్రం మార్చలేదు. గంటా ఎక్కడున్నా మంత్రి పదవి గంట మోగాల్సిందేనన్నది. అదే గంటా ఫిలాసఫి. కేబినెట్‌ పదవి లేకపోతే ఆయనకు ఎక్కడలేని తంటా. ఇదే ఇప్పుడు ఆయనకు పుట్టిస్తోందట మంట.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరదామంటే, సీఎం జగనేమో తలుపు మూసేశారు. రావాలనుకుంటే పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి రావాలని, అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. దీంతో వైసీపీలోకి వెళ్లాలని గంటా ఎంత ప్రయత్నించినా, ఎంతమందితో మంతనాలు జరిపినా, ప్రయత్నాలు ఫలించలేదని, ఆయన అనుచరులే మాట్లాడుకుంటున్నారు. అందుకే రాష్ట్రంలో కాకపోయినా, కేంద్రంలోనైనా అధికారంలోకి ఉంది కదా అని, కాషాయ తీర్థం పుచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారట గంట.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరిస్థితి బాలేదని, నాయకత్వ సంక్షోభం తప్పదని, ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు కమలంలో విలీనమయ్యారు. ఇక కాపు నేతలంతా సమావేశమై, బీజేపీ కండువా కప్పుకోవాలని భావిస్తున్నారట. ఈ పరిస్థితుల్లో తాను సైతం పార్టీ మారాలని అనుకుంటున్నారట గంటా శ్రీనివాస రావు. ఈ‍యనతో పాటు ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సైతం బీజేపీలోకి తీసుకెళ్లడానికి గంటా ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

గంటా శ్రీనీవాసరావు పొలిటికల్ హిస్టరీ మొత్తం ట్విస్టులమయం. గంటా శ్రీనివాసరావును రాజకీయాలకు పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. విశాఖలో షిప్పింగ్ బిజినెస్ ఉండే గంటాకు అప్పట్లో రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి ఉండటంతో, టీడీపీ అధినేతకు పరిచయం చేశారు. 1999 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా సీటు ఇప్పించి, గెలిపించారు కూడా. కానీ తర్వాతి కాలంలో తన రాజకీయ గురువు అయ్యన్నతో శత్రుత్వం తెచ్చుకున్నారు గంటా. ఇప్పుడాయనతో మాటల్లేవు, మాట్లాడుకోవడాల్లేవు.

ఇక 2009లో గంటా తనదైన రాజకీయాలకు మరింత పదును పెట్టారు. సరిగ్గా అదే సమయంలో తెలుగుదేశంకు గుడ్ బై చెప్పి, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోకి జంపయ్యారు. అప్పుడు కూడా పోటీ చేసే స్థానాన్ని మార్చేశారు. ప్రజారాజ్యం తరఫున అనకాపల్లిలో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైంది. గంటాకు మంత్రి పదవి దక్కింది. 2014 ఎన్నికల్లో మళ్లీ గంటా పార్టీ మార్చేసారు. టీడీపీలోకి జంపయ్యారు. మళ్లీ మంత్రయ్యారు. ఇప్పుడు కూడా నియోజకవర్గాన్ని మార్చేసి, మరో చోట గెలిచారు. కానీ మంత్రి మంత్రి కాలేకపోయారు. ప్రతిపక్షంలో కూర్చున్నారు. మంత్రిగా రెండు పర్యాయాలు చక్రంతిప్పిన గంటాకు, ఆ పదవి లేక చేతులు కాళ్లూ ఆగడం లేదంట. అందుకే మరో పార్టీలో గంట మోగించేందుకు సిద్దమయ్యారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

పోటీ చేసిన ప్రతిసారి గెలుపువాకిట నిలవడం గంటాకు కలిసివస్తున్న అంశం. గంటా శ్రీనివాసరావు కాపు సామాజిక వర్గం, భార్య చౌదరి కావడంతో, కమ్మ, కాపు కులాలు కూడా గంటాకు కలిసొస్తున్నాయి. దీంతో రాజకీయాల్లో రెండు ప్రధాన సామాజిక వర్గాలను సమన్వయం చేసుకుంటూ రాజకీయాల్లో రారాజుగా వెలిగారు. కానీ ఎప్పుడూ కాలం అన్నిసార్లూ అనుకూలంగా ఉండదు. ఇప్పుడు గంట మోగించేందుకు కాలం కాదు. వైసీపీలోకి వెళ్లలేని పరిస్థితి. అందుకే కమలం వైపు చూస్తున్నారట గంటా. తనతో పాటు ఐదుగురిని కూడా లాగుతారట. ఇదే చేస్తే, పోతూపోతూ చంద్రబాబుకు ప్రతిపక్ష హోదాను కూడా గంటా లాగేసినట్టవుతుంది. మరి గంట ఎలాగైనా మోగించాలని తపిస్తున్న శ్రీనివాస రావు, ఏ పార్టీలో మోగిస్తారో, అదెలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

Full View

Similar News