ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం వైట్ వాష్ అవ్వనుందా..?
వాళ్లిద్దరూ అన్నదమ్ములు. ఆ జిల్లాలో తెలుగుదేశానికి రామ, లక్ష్మణులని పేరు తెచ్చుకున్నారు.
వాళ్లిద్దరూ అన్నదమ్ములు. ఆ జిల్లాలో తెలుగుదేశానికి రామ, లక్ష్మణులని పేరు తెచ్చుకున్నారు. కానీ రాముడు కండువా మార్చి, పార్టీ జంప్ చేశారు. పార్టీని కాపాడాల్సిన లక్ష్మణుడు మాత్రం, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, పార్టీని గాలికొదిలేశారట. అసలే అనేక బాధలతో పార్టీని లాగుతున్న చంద్రబాబును, ఆ జిల్లా టీడీపీ పరిస్థితి మరింత బాధపెడుతోందట.
ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం వైట్ వాష్ అవ్వనుందా....? ఆ నాయకుడి వెంటే పార్టీ శ్రేణులు కదలనున్నాయా...? టీడీపీ కార్యకర్తల రాకకోసమే వైసీపీ ఎమ్మెల్యే తన ఇంటి గేట్లు బార్లా తెరిచాడా....? ఇవే ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్... రోజు రోజుకి టీడీపీ నేతల సంఖ్య ఆ నియోజకవర్గంలో తగ్గిపోతోంది. ఎక్కడికక్కడ పసుపు పార్టీ శ్రేణులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. దీంతో తలలు పట్టుకోవడం జిల్లా అధిష్ఠానం వంతు అవుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి...? అక్కడ టీడీపీకి ఎందుకు అంత షాక్ తగులుతోంది....? వాచ్ థిస్ స్పెషల్ రిపోర్ట్....
నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ రాజకీయాలు అందరి దృష్టినీ తమ వైపుకు తిప్పుకుంటున్నాయి. దశలవారీగా అధికార పార్టీ బలం పెరుగుతూ, ప్రతిపక్ష పార్టీ బలహీన పడుతోందన్న చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేని విధంగా, తెలుగుదేశం పార్టీ అంపశయ్యను ఎక్కే పరిస్థితి ఏర్పడిందన్న మాటలు, పార్టీ అధినేత చంద్రబాబును మరింత కలవరానికి గురి చేస్తున్నాయి.
ఒకప్పుడు తెలుగుదేశంకు కంచుకోటగా ఉన్న కావలి నియోజకవర్గంలో, ఇప్పుడు ఆ పార్టీకి ఎన్నడూలేని విధంగా కోలుకోలేని దెబ్బ తగులుతోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం కావలి నియోజవకర్గంలో తెలుగుదేశానికి అన్నీ తానై ఉన్న బీదా మస్తాన్‌రావు, పార్టీని వీడి వైఎస్సార్కాంగ్రెస్లో చేరారు. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద బలంగా మారింది. బీదా మస్తాన్ రావును చూసి ఎంతో మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు వైసిపిలోకి వెళ్లిపోతున్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో సఖ్యతగా ఉంటూనే, బీదా మస్తాన్‌రావు తనదైన రాజకీయాలు చేస్తూ, పార్టీలో చక్రం తిప్పుతున్నారు
.కావలి నియోజకవర్గంలో బీదా మస్తాన్‌రావు వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీలో చేరిన తరువాత, తెలుగుదేశంలో ముందుండి నడిపించే నాయకుడు కరువయ్యాడు. దీంతో కిందిస్థాయి నాయకులు చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉండిపోయారు. ఇదే ఇప్పుడు వైసిపికి కలిసి వచ్చే అంశమైతే, తెలుగుదేశానికి పెద్ద దెబ్బ.
అంతేకాదు తెలుగుదేశం జిల్లా అధ్యక్షులుగా ఉన్న బీదా రవిచంద్ర అనుచిత నిర్ణయాలు కూడా తెలుగుదేశం పార్టీని నిర్వర్యం చేస్తున్నాయనేది విశ్లేషకుల భావన. కావలి నియోజకవర్గంలో ఈనెల 5వ తేదిన తెలుగుదేశం పార్టీకి చెందిన కావలి పట్టణ అధ్యక్షులు అమరా వేదగిరి సుబ్బారాయుడు గుప్తాతో పాటూ, మరో నలుగురు ముఖ్య నేతలు ఎమ్మెల్యే రామిరెడ్డి, బీదా మస్తాన్‌రావు సమక్షంలో వైసిపి కండువాను కప్పుకున్నారు. దీనిని ముందుగానే గ్రహించిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు, వీరు పార్టీలో చేరే నాలుగు రోజుల ముందుగానే కమిటిలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, త్వరలోనే అడ్‌హక్ కమిటి వేస్తామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారింది.
అటు ముసునూరులోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన తేనేటి విందులో, కొందరు టిడిపి నేతలు పాల్గొనడంతో ఆగ్రహించిన టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, మొత్తం 11 మందిని పార్టీ నుంచి సస్పెండ్‌చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ నేతల్లేని పార్టీగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ కావలి వైసిపి నేతలు చాకచక్యంగా తమకు అనుకూలంగా మలుచుకుంటుండంతో, టిడిపి పరిస్థితి దారుణంగా మారిపోయింది.
కావలి నియోజకవర్గాన్ని వైఎస్సార్‌కాంగ్రెస్, ఇప్పుడు తన కంచుకోటగా మార్చుకుంటోంది. ఒక్కొక్కరుగా తెలుగుదేశం నేతలు బీదా మస్తాన్‌రావును చూసి ఆ పార్టీలో చేరుతుండటం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావుకు వీరాభిమానులుగా ఉండేవారు కూడా టిడిపికి గుడ్‌బై చెబుతుండటం, మిగిలిన తమ్ముళ్ల కలవరానికి కారణమవుతోంది. అటు బీదా మస్తాన్ రావుకు రాజ్యసభ ఇస్తామన్న వైసిపి ఆఫర్కూడా, ఈ వలసల పర్వానికి ఒకింత బలాన్ని చేకూరుస్తోంది.
ఈ తరుణంలో కావలి నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి ఏకఛత్రాధిపత్వం వహిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే నియోజకవర్గంలో తెలుగుదేశం మరింత పతనమయ్యే పరిస్థితి ఏర్పడిందని, ఒకే పార్టీలో ఉండిన అన్నదమ్ములు బీదా మస్తాన్‌రావు, బీదా రవిచంద్రలు, ఇప్పుడు రాజకీయ శత్రువులుగా మారడంతో కావలి రాజకీయాలు రసవత్తరంగా మారాయంటున్నారు. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వెలువడితే మరింత మంది సైకిల్‌దిగి ఫ్యాన్కిందకు వెళ్లే పరిస్థితులున్నాయంటున్నారు.
కావలిలో టీడీపీకి ఇలాంటి పరిస్థితులు దాపురించడానికి కారణం, పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న బీదా రవిచంద్ర తీరేనని, కొందరు బాహాటంగానే విమర్శలు కురిపిస్తున్నారు. కార్యకర్తలు, నేతలకు అందుబాటులో లేకపోవడం, అమరావతిలో ఎక్కువ సమయం గడుపుతుండటంతో, కావలిలో తెలుగుదేశం పార్టీకి గడ్డుకాలం ఏర్పడిందంటున్నారు. ఇప్పటికైనా టిడిపి అధినాయకత్వం మేల్కోకపోతే, కావలిలో టిడిపి అడ్రస్గల్లంతయ్యే పరిస్థితి ఉందంటున్నారు పార్టీ కార్యకర్తలు. ఈ పరిణామాలను బేరీజు వేసుకుంటున్న వైసిపి శ్రేణులు... కావలిలో తిరుగులేని పార్టీగా వైసిపిని మార్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారట.