Chandrababu: జగన్ తానే చివరి ముఖ్యమంత్రిని అనుకుంటున్నారేమో?
Chandrababu: ఆస్తులను తాకట్టుపెట్టడమే పనిగా పెట్టుకున్నారు
Chandrababu: గత 66 ఏళ్లలో చేసిన అప్పు రూ.3.14లక్షల కోట్లయితే.. ఇప్పుడు రాష్ట్ర అప్పు సుమారు రూ.7లక్షల కోట్లకు చేరిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వ్యక్తులు మారుతారు కానీ లెక్కలు శాశ్వతమని చెప్పారు. ప్రభుత్వానికి కొన్ని లెక్కలుంటాయని.. ఏం జరిగిందో చరిత్ర మొత్తం డాక్యుమెంటేషన్‌తో ఉంటుందన్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని.. అప్పును రూ.7లక్షల కోట్లకు తీసుకెళ్లిన వారిని ఏమనాలని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్, వైకాపా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆస్తులను తాకట్టు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తానే చివరి ముఖ్యమంత్రినని.. ఇక రాష్ట్రం ఉండదని జగన్ అనుకుంటున్నట్టున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్తును సీఎం అంధకారం చేశారని.. రాజ్యాంగ వ్యవస్థల్ని ధ్వంసం చేశారని ఆరోపించారు.
'మన రాష్ట్ర జనాభా రూ.5కోట్లు. ప్రతి కుటుంబంపైనా ఇప్పుడు రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు అప్పు ఉంది. ప్రజల నుంచి బలవంతంగా పన్నులు వసూళ్లు చేస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ రాష్ట్రంలోని ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెడుతున్నారు. కలెక్టరేట్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు.. ఇప్పుడు బెర్మ్ పార్కు తనఖా పెట్టారు. చివరికి రోడ్లు.. ఆ తర్వాత ప్రైవేట్ ఆస్తులు కూడా తాకట్టు పెట్టేస్తారు. అప్పుల్లో ఉన్నాం.. ఎవరమూ తప్పించుకోలేం. ఆకాశం నుంచి ఎవరూ రారు.. మనమే కట్టాలి. మరోవైపు పన్నులు విపరీతంగా పెంచారు. పెట్రోల్, గ్యాస్, మద్యం, విద్యుత్‌ఛార్జీల ధరలు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయి. చివరికి చెత్త, మరుగుదొడ్లు, వారసత్వ ఆస్తులపైనా పన్నులు వేస్తున్నారు. ఎందుకీ పన్నుల భారం? ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోని వెళ్తున్నాయి?'' అని చంద్రబాబు నిలదీశారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. జగన్‌కు సొంత లాభం తప్ప.. ప్రజాక్షేమం పట్టదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జీవన ప్రమాణాలు దిగజారిపోయాయని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ సర్కార్‌ను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్ర ద్రోహుల ఆట కట్టించాలంటే.. ప్రజాచైతన్యం రావాలని బాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని జగన్ సర్కార్ అప్పుల ఊబిలోకి నెట్టేసిందని విమర్శించారు. రెండున్నరేళ్లలో జగన్‌రెడ్డి రూ.7లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబంపై రూ.5లక్షల అప్పు భారం మోపారన్నారు. జగన్ చేసే అప్పులు ఎవరూ కట్టరని.. రేపు ప్రజలే కట్టాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెడుతున్నారని మండిపడ్డారు.