Badvel By- Election: ఏపీలో హీట్ పుట్టిస్తున్న బద్వేల్ ఉపఎన్నిక

*పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ, జనసేన పార్టీలు *ఉపఎన్నిక బరిలో దిగిన రెండు జాతీయ పార్టీలు

Update: 2021-10-11 02:57 GMT

ట్రయాంగిల్ వార్‌గా మారిన ఉపఎన్నిక పోటీ(ఫోటో- ది హన్స్ ఇండియా)

Badvel By- Election: కడప జిల్లాలో బద్వేల్ ఉపఎన్నిక హీటు పుట్టిస్తుంది. ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేనలు పోటీ నుంచి తప్పుకోవడంతో వార్ వన్ సైడ్ అవుతుందనుకున్న పరిస్థితి రివర్స్ అయింది. రెండు జాతీయ పార్టీలు ఉపఎన్నిక బరిలో దిగడంతో పోటీ ట్రయాంగిల్ వార్‌గా మారింది. ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లతో అధికార వైసీపీ వైపు కాలు దువ్వుతున్న పార్టీలు గెలుపు తమదేనంటూ దీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఏకగ్రీవమవుతుందనుకున్న ఎన్నిక ఇప్పుడు రసవత్తరంగా మారుతుంది.

బద్వేల్ ట్రయాంగిల్‌ వార్‌లో అగ్రనేతలు ఆరంగేట్రం చేయనున్నారు. స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం హోరెత్తించనున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వైసీపీ ఆగ్రనేతలు కలియ తిరుగుతుండగా బీజేపీ నేతలు పాగా వేశారు. ఇక తామేమీ తక్కువ కాదంటున్న కాంగ్రెస్ 20 మంది స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను ప్రకటించింది. ఇక ఈ కమిటీలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రులు జేడి శీలం, చింతామోహన్, పల్లంరాజు, సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, ఉమెన్ చాంధీ, బాపిరాజు, హర్షకుమార్, రఘువీరారెడ్డిలు ఉన్నారు.

ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో జరుగుతున్న ఉపఎన్నికలో భారీ మెజార్టీ సాధించే దిశగా అధికార వైసీపీ అడుగులు వేస్తోంది. మరో వైపు చెప్పుకోదగ్గ ఓట్లను కొల్లగొట్టి తమ సత్తా చాటాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తహతహలాడుతున్నాయి. అక్కడి ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేల్ ఎమ్మెల్యే ఉపఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో అధికార వైసీపీ పార్టీ వెంటక సుబ్బయ్య సతీమణికే టిక్కెట్‌ను కేటాయించడంతో టీడీపీ, జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి. ఇక మిత్ర పక్షం తప్పుకోగా బీజేపీ ఒంటరి పోరుకు సిద్దమైంది. జనసేన పోటీ చేయకున్నా తమకు మద్దతు ఇస్తుందని చెబుతోంది.

మొత్తానికి బద్వేల్ ఉపఎన్నికలో ప్రధాన ప్రతిపక్షాలు. సానుభూతి, సాంప్రదాయమంటూ పోటీ నుంచి వైదొలగితే బీజేపీ-కాంగ్రెస్‌లు కయ్యానికి సై అంటున్నాయి. మరోవైపు మొన్నటికి మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ గెలుపు తమదేనంటూ దీమా వ్యక్తం చేస్తోంది. 

Tags:    

Similar News