Tasty Food for Covid Patients: కోవిడ్ రోగులకు రుచికరమైన ఆహారం ఇవ్వకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు

Tasty Food for Covid Patients: కరోనాకు విరుగుడు ఇప్పటివరకు వైద్యులు చెప్పిన ప్రకారం చూస్తే మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడమే.

Update: 2020-07-08 03:30 GMT
Alla Nani (File Photo)

Tasty Food for Covid Patients: కరోనాకు విరుగుడు ఇప్పటివరకు వైద్యులు చెప్పిన ప్రకారం చూస్తే మంచి పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవడమే. అటువంటిది అలాంటి వారికి ప్రభుత్వం నిర్వహిస్తున్న క్వారెంటైన్ సెంటర్లలో నాణ్యమైన ఆహారం అందించకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చేయి దాటే ప్రమాదముంది. వీటి నిర్వహణపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు అరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. గ్రామస్థాయిలో ఉన్న క్వారెంటైన్ లలో ఉండే పరిస్థితి చూస్తే మరింత దారుణంగా ఉంటోంది. దీనిపై స్పందించిన మంత్రి ఆళ్లనాని వీరికి భోజనం అందిస్తున్న కాంట్రాక్టర్లకు హెచ్చరిక చేశారు. భోజనం అందిండచం విషయంలో ఏమైనా తేడా వస్తే కేసులు నమోదు తప్పదంటూ చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలోని కొవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ సెంటర్లలో ఆహార సరఫరా కాంట్రాక్టులు తీసుకున్నవారు రోగులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. కొవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ సెంటర్లలోని బాధితులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ఒక్కొక్కరికి రోజుకు రూ.500 చొప్పున చెల్లిస్తోందని చెప్పారు. కాంట్రాక్టర్లు ఎక్కడైనా అవినీతికి పాల్పడినట్టు తేలితే వెంటనే తొలగించి, వారిపై కేసులు నమోదు చేయడానికి కూడా వెనకాడబోమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కొవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ సెంటర్లలో కరోనా రోగులకు నాణ్యతలేని భోజనం అందిస్తున్న తీరుపై పలు చోట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఆళ్ల నాని విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌)ని సందర్శించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న వారికి అందిస్తున్న భోజనం, ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. వాటిని రుచి చూశారు.

మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు. ఈ ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపైనా మంత్రి ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొందరు కరోనా రోగులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి మాట్లాడారు. సమస్యలేమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత కేసులు పెరుగుతున్నాయన్నారు. క్వారంటైన్‌ సెంటర్లలో సరైన ఆహారం, చికిత్స అందించడం లేదని మీడియాలో వచ్చిన కథనాలను చూసి ముఖ్యమంత్రి స్పందించారని తెలిపారు. అందుకే విజయవాడలోని కొవిడ్‌ ఆస్పత్రిని సందర్శించానని, ఇక్కడ రోగులకు అందుతున్న సేవలు సంతృప్తికరంగానే ఉన్నాయని అన్నారు.

చిన్నచిన్న లోపాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే సరిచేస్తామన్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని క్వారంటైన్‌ సెంటర్లను పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తుండటం వల్ల ఫలితాలు ఆలస్యమవుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ప్రైవేట్‌ ల్యాబ్‌ల్లో తప్పుడు రిపోర్టులు ఇస్తున్నట్టు వచ్చిన ఆరోపణలు నిజమైతే ఆ ల్యాబ్‌ల పర్మిషన్‌ను రద్దు చేస్తామన్నారు.


Tags:    

Similar News