Andhra Pradesh: మాజీమంత్రి దేవినేని ఉమాపై రాళ్లదాడి
* ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచురులే దాడి చేశారని ఆరోపణ * దేవినేని ఉమాపై దాడిని ఖండిస్తున్నాం: చంద్రబాబు
Andhra Pradesh: కృష్ణా జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. మైలవరం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ నాయకుల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. జి. కొండూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి దేవినేని ఉమాపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. అయితే దేవినేని ఉమా మాత్రం కారులోనే ఆరు గంటల పాటు కూర్చొని నిరసన తెలిపారు. ఉమాతో మాట్లాడేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో కారును క్రేన్‌తో తరలించారు. అద్దాలు పగులకొట్టి మరీ ఉమాను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు డీఎస్పీ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావును గృహనిర్భంధం చేశారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై వైసీపీ వర్గీయులు రాళ్లదాడికి దిగారు. కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై ఆయన ఆ ప్రాంతానికి పరిశీలనకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా ఉమా కారును జి. కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద కొంత మంది అడ్డుకున్నారు. వాహనం చుట్టుముట్టి మూకుమ్మడిగా దాడి చేశారు. రాళ్లదాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ వర్గీయులు అక్కడి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దేవినేని ఉమపై జరిగిన దాడి నేపథ్యంలో జి. కొండూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. దేవినేని ఉమపై దాడి చేసిన వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో అక్కడకు వైసీసీ నేతలు కూడా రావడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. దేవినేనిపై జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. అవినీతి, అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడతారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతలు ప్రజా సంపద దోచుకుంటుంటే అడ్డుకోవడం తప్పా అంటూ మండిపడ్డారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వీరప్పన్ బండారం బయటపెట్టినందుకే దాడి చేశారని లోకేష్ విమర్శించారు. వందల ఎకరాల్లో మైనింగ్ జరుగుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదని టీడీపీ నేత పట్టాభి ప్రశ్నించారు. పోలీసులు వైసీసీ కబంధ హస్తాల్లో చిక్కుకున్నారని విమర్శించారు.
మరోవైపు ఈ ఘటనపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పందించారు. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లనే వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారని అన్నారు. నియోజకవర్గంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. అనవసరపు పనులతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సంబంధం లేని అంశాలను తనకు ఆపాదించి ప్రభుత్వాన్ని కించపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.