Srivari Salakatla Brahmotsavam: శాస్త్రోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు...
Srivari Salakatla Brahmotsavam | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అంకురార్పణ జరగనుంది.
Srivari Salakatla Brahmotsavam | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అంకురార్పణ జరిగిందని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం సాయంత్రం 6.03 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఈ నెల 23వ తేదీ గరుడసేవ రోజున సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ముఖ్యమంత్రి వర్యులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నందువల్ల గరుడసేవ రోజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలని తాము కోరినందువల్లే సిఎం ఆరోజు వస్తున్నారని చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌తో కలిసి శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ప్రధానాంశాలు ఇవి..
బ్రహ్మోత్సవాల వాహనసేవలు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తాం. గరుడసేవ మాత్రం రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు జరుగుతుంది.
* 24వ తేదీ ఉదయం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ యడ్యూరప్పతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అనంతరం ఉదయం 7 గంటలకు నాదనీరాజన వేదిక మీద జరిగే సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు.
* ఉదయం 8 గంటలకు కర్ణాటక సత్రాల నిర్మాణానికి ముఖ్యమంత్రులిద్దరు భూమిపూజ చేస్తారు. ఈసారి స్వర్ణరథం, రథరంగ డోలోత్సవం బదులు సర్వభూపాల వాహనసేవ జరుగుతుంది.
* ఈ నెల 27వ తేదీన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు భక్తితో ఆసక్తిగా ఎదురు చూస్తారు. * ఈ ఏడాది కోవిడ్-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో పాలకమండలి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో వాహనసేవలు జరుగుతాయి.
* స్వామివారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆగమోక్తంగా నిర్వహించే కార్యక్రమాలు యథాతథంగా నిర్వహిస్తారు. భక్తుల కోసం వాహనసేవలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. టిటిడి ప్రజాసంబంధాల విభాగం ద్వారా మీడియాకు ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటనలు, ఫొటోలు అందిస్తాం.
ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ...
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ జరుగుతున్న సమయంలో శ్రీవారి కల్యాణోత్సవం లైవ్ ఉన్నందువల్ల ఎస్వీబీసీ ఆ కార్యక్రమాన్ని లైవ్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత వార్తల్లోను, ప్రత్యేక కార్యక్రమంలోను ఈ అంశాన్ని ప్రధానంగా ప్రసారం చేసింది.శ్రీవారి ఆలయంలో హుండీ నిండిన తరువాతే కొత్త వస్త్రం మార్చడం జరుగుతుంది. ఈ ఏడాది డిసెంబరుకు రూ.5 వేల కోట్ల డిపాజిట్లు కాలపరిమితి ముగుస్తుంది. ఆ తరువాత అధిక వడ్డీ వచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఒక నిర్ణయానికి వస్తాం. పెరటాసి మాసం రద్దీ వల్ల తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు జారీ చేసే కౌంటర్ల వద్ద కోవిడ్ నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నందువల్లే ఆ టికెట్ల జారీని తాత్కాలికంగా నిలిపివేశాం. పరిస్థితులు అదుపులోకి వచ్చాక వీటిని పునరుద్ధరిస్తాం.
శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు :
కోవిడ్ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో నిర్వహించాలని నిర్ణయించాం. చక్రస్నానానికి సంబంధించి ఆలయంలోనే ఏర్పాట్లు చేశాం. అయినా, అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాం. అష్టదిక్పాలకులకు జరిగే ఉపచారాలు, బలి, నైవేద్యాల సమర్పణ ఆలయ ప్రాకారంలోనే నిర్వహిస్తాం. ఈ మీడియా సమావేశంలో టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో పి.బసంత్‌కుమార్, సివిఎస్వో గోపినాథ్‌జెట్టి, ఎస్వీబీసీ సీఈవో సురేష్ కుమార్ పాల్గొన్నారు.