పెద్దల సభ తెలుగుదేశానికి అచ్చిరావడం లేదా రాజ్యసభలో గట్టిగా గళమెత్తుతారని, కాచివడబోసి పంపిస్తే, తిరిగి జట్కా ఇవ్వడమేంటి గతంలోనూ చాలామంది టీడీపీ రాజ్యసభలు, మరో పార్టీలోకి జంపయ్యారు. ఆ లిస్టులో ఎవరెవరున్నారు ప్రస్తుతం ఏయే పార్టీలో ఉన్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు పెద్దలసభ సభ్యులు, కమలం తీర్థం పుచ్చుకోవడంతో మరోసారి టీడీపీ రాజ్యసభ ప్రతినిధులపై చర్చ మొదలైంది. ఒక్కసారి హిస్టరీ పేజీలు తిరగేస్తే, టీడీపీ ఎంపీలు వరుసబెట్టి పార్టీకి షాకిచ్చారు. తెలుగుదేశం తరఫున రాజ్యసభకు నామినేట్ చేసిన వారిలో కేవలం ఇద్దరు మినహా మిగిలిన వారంతా, పార్టీకి పంగనామాలు పెట్టారు. పదవిలో ఉండగా కొందరు, పదవీ కాలం ముగిసిన తర్వాత ఇంకొందరు, టీడీపీకి రాంరాం చెప్పేశారు. ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పుడు చంద్రబాబునాయుడు జమానా వరకు, హిస్టరీ మొత్తం ఇదే చెబుతోంది. అందుకే ఒక్కసారి రాజ్యసభకు పంపించామా, ఆ నేత ఇక మనకులేడనుకునే పరిస్థితికొచ్చింది టీడీపీ.
తెలుగుదేశం నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన వారిలో మోహన్ బాబు ఒకరు. ప్రస్తుతం ఆయన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో ఉన్నారు. ఇక జయప్రద కూడా రాజ్యసభలో టీడీపీ ప్రతినిధిగా వ్యవహరించారు. తర్వాత ఎస్పీలోకి మారారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ.
రేణుకా చౌదరి కూడా ఒకప్పుడు టీడీపీ రాజ్యసభ సభ్యురాలే. ఇప్పుడామె కాంగ్రెస్. పర్వతనేని ఉపేంద్ర నాడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న టీడీపీ ఎంపీ. వంగా గీత ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. కడప జిల్లాకు చెందిన సి.రామచంద్రయ్య రాజ్యసభలో టీడీపీ ఎంపీగా గట్టిగానే గళమెత్తారు. కానీ పదవీకాలం ముగిసిన తర్వాత చంద్రబాబును తిట్టినతిట్టు తిట్టకుండా బయటికొచ్చారు. ప్రజారాజ్యంలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడాయన వైసీపీ గూటికి చేరారు. తులసిరెడ్డి కూడా ఇప్పడు కాంగ్రెస్‌లో ఉన్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు నేడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో ఉన్నారు. గుండు సుధారాణి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. రామమునిరెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యలమంచిలి శివాజీ, మైసూరారెడ్డి వంటి వారు కూడా ఇదే జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం వీరంతా టీడీపీలో లేరు. వారంతా రాజ్యసభకు వెళ్లిన తర్వాత తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన వారే. రాజ్యసభకు నామినేట్ అయిన వారిలో ఇంకా టీడీపీతోనే ఉన్నవారిలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, కంభంపాటి రామ్మోహన్ రావు ఉన్నారు. వారిద్దరూ చంద్రబాబుతోనే ఇంకా నడుస్తున్నారు.
నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేష్‌లు, కమలం తీర్థం పుచ్చుకోవడంతో, మరోసారి టీడీపీకి రాజ్యసభ అచ్చిరాలేదని తేలిపోయిందని, అదే పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. కనకమేడల రవీంద్ర కుమార్, తోట సీతా రామలక్ష్మి మాత్రమే మిగిలారు. రామలక్ష్మి పదవీకాలం మరో ఏడాదిలో ముగుస్తుంది. కనకమేడల రవీంద్ర కుమార్‌కు మరో నాలుగేళ్ల పదవీకాలం ఉంది. అయితే టీడీపీ సభ్యులు, రాజ్యసభలో విలీనం కావడం చెల్లదంటూ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి విన్నవించారు లోక్‌సభ ఎంపీలు. మొత్తానికి టీడీపీ నుంచి రాజ్యసభకు పంపినవారంతా, మరో పార్టీలోకి వెళ్లడమో, లేదంటే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండటమో జరుగుతోంది. దీంతో టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీకి కలిసిరావడంలేదని, పార్టీలో చర్చ జరుగుతోంది.