Tirumala: శ్రీవారి డాలర్ల కొరత తీరేదెన్నడో?.. రెండేళ్లుగా భక్తుల ఎదురుచూపులు
Tirumala: తిరుమల వేంకటేశ్వర స్వామి, అమ్మవార్ల ప్రతిమలుండే బంగారు డాలర్లంటే భక్తులు అమితాసక్తి చూపుతారు.
Tirumala: తిరుమల వేంకటేశ్వర స్వామి, అమ్మవార్ల ప్రతిమలుండే బంగారు డాలర్లంటే భక్తులు అమితాసక్తి చూపుతారు. అయితే ప్రస్తుతం శ్రీవారి బంగారు డాలర్లకు కొరత ఏర్పడింది. అధిక డిమాండ్ ఉండే 2, 5 గ్రాముల డాలర్ల విక్రయాలు నిలిచిపోయాయి. డాలర్ల కోసం కౌంటర్ వద్దకు వెళ్లిన భక్తులకు నో స్టాక్ అంటూ సిబ్బంది వెనక్కి పంపేస్తున్నారు. దీంతో భక్తులు అసహనానికి గురవుతున్నారు. అసలు తిరుమలలో బంగారు డాలర్ల కొరత ఎందుకు ఏర్పడింది? ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు? భక్తులు ఎంతో సెంటిమెంట్‌గా భావించే డాలర్లు తిరిగి బహిరంగ మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తాయి?
శ్రీవారిని దర్శించుకునే పలువురు భక్తులు ఇంట్లోనూ ఆయన కొలువై ఉండాలనే ఉద్దేశంతో స్వామివారి డాలర్లను కొనుగోలు చేస్తారు. ఆ డాలర్లు ఇంట్లో ఉంటే శుభకరమన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. వారి ఆశలపై టీటీడీ నీళ్లు చల్లుతోంది. రెండేళ్లుగా 10 గ్రాముల బంగారు డాలర్లు మినహా మరేవీ దొరక్కపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు వెండి డాలర్ల కొరత తీవ్రంగా ఉంది.
తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న కౌంటర్లలో 2, 5, 10 గ్రాముల బంగారు డాలర్లతో పాటు 5, 10 గ్రాముల వెండి, 5, 10 గ్రాముల రాగివి విక్రయించే వారు. అయితే ఎక్కువగా వెండి, ఇత్తడితో పాటు 2, 5 గ్రాముల బంగారు డాలర్లను కొనేందుకు శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురుచూసేవారు. రెండేళ్లుగా 2, 5 గ్రాముల డాలర్లు అందుబాటులో లేవని భక్తులు చెబతున్నారు.
ఎక్కువగా 10 గ్రాముల డాలర్లే అందుబాటులో ఉంటున్నాయి. వాటి ధర సుమారు 50 వేల రూపాయల వరకు ఉంటుంది. సామాన్యులు అంత వెచ్చించి కొనలేరు. మధ్యతరగతి వారు ఎక్కువగా కొనే 2 గ్రాముల బంగారు, 5, 10 గ్రాముల వెండి నాణేలు అందుబాటులో ఉండటం లేదు. పేదలు ఎక్కువగా కొనే రాగి డాలర్లు సైతం అందుబాటులో లేకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో 50 గ్రాముల స్వామివారి వెండి డాలర్లను అందుబాటులోకి తెచ్చారు. ముందుగా వెయ్యి డాలర్లను ప్రయోగాత్మకంగా విక్రయించారు. అవి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తర్వాత నిలిపివేశారు. ఈ డాలర్లపై భక్తులు ఆసక్తి చూపించినా టీటీడీ సద్వినియోగం చేసుకోలేకపోతోందన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా 2, 5, 10 గ్రాముల బంగారు డాలర్లను అందుబాటులోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.