ఏపీలో మొదలైన సంక్రాంతి సంబరాలు
* పందేలకు సిద్ధమవుతున్న పందెంరాయుళ్లు * కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆంక్షలు * కోడిపందాల నిర్వహణపై హైకోర్టు నిషేధం
తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. హరిదాసు కీర్తనలు, బసవన్న దీవెనలు, ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, తెల్లవారుజామున జంగమదేవర జేగంటలు, ఢమరుక నాదాలు, పిట్టలదొర బడాయి మాటలూ, గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటలు ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు.
కోస్తాంధ్ర, రాయలసీమలో సంక్రాంతి పండుగను నాలుగు రోజులపాటు జరుపుకుంటారు. బంధుమిత్రులు, కొత్త కోడళ్లు, అల్లుళ్లు రాకలతో పల్లెలు సందడిగా మారుతాయి. ఆకాశమంత ఆనందం భూ మండలమంత సంతోషం కలిస్తే ఎలా ఉంటుందో సంక్రాంతి పండుగ సందడి అలా ఉంటుంది. పతంగుల కోలాహలం, కోడి పందేలు జోరు ఈ పండుగకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకొచ్చేది కోడి పందాలు. పండగ నాలుగు రోజులు పల్లెల్లో కోడి పందాల జోరు అంతా ఇంతా కాదు. పండగకు ఐదు నెలల ముందు నుంచే కోడి పందాలకు సిద్ధమవుతుంటారు పందెం రాయుళ్లు. పెద్ద సంఖ్యలో బరులు ఏర్పాటు చేసి కోళ్లను బరిలోకి దింపుతారు. ఆ నాలుగు రోజులు డబ్బు కోట్లల్లో చేతులు
పందెం రాయుళ్లు ఒక్కో పుంజుకు రోజుకు 100 నుంచి 400 రూపాయల వరకు ఖర్చు చేస్తారు. పందెం కోళ్లను తయారు చేయడంలో వారు తీసుకునే శ్రద్దను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఉదయాన్నే ఐదు గంటలకు కోడి పుంజులను బయటకు తీసి కాసేపు చల్లటి గాలి పీల్చుకునేలా ఏర్పాట్లు చేస్తారు. అనంతరం కోడి పుంజులను వదిలి పెట్టి పరుగెత్తిస్తారు. ఆ తర్వాత స్విమ్మింగ్ చేయిస్తారు. పుంజులు అలసిపోకుండా బాదం, పిస్తా, ఖర్జురా, కిస్‌మిస్‌లను పాలల్లో నానబెట్టి, సిరంజీ ద్వారా పాలను పుంజులకు పట్టిస్తారు. ఇలా పెంచిన ఒక్కొక్క పందెంకోడి రేటు లక్ష నుంచి 5 లక్షల వరకు పలుకుతుంది.
మరోవైపు కరోనా నేపథ్యంలో కోడిపందాలు నిర్వహించకూడదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోడిపందాలు జరగకుండా చూసుకునే బాధ్యత పోలీసులకు అప్పగించింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జనవరి 25 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు జిల్లా ఎస్పీ నయిం ఆస్మి. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కోడిపందాలు సాంప్రదాయంగా వస్తున్నాయని సంవత్సరంలో ఒకసారి జరిగే కోడిపందాలు అడ్డుకోవడం కరెక్ట్‌కాదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. పందాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఆసక్తి ఉన్నవారు తరలివస్తారన్నారు. కోడిపందాలను ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు. ఎంతో ఖర్చు వెచ్చించి కోళ్లను పెంచుతామని.. ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం సరికాదని అంటున్నారు.
ఇక కోడిపందాల నిర్వహణపై స్పందించారు రాజోలు సీఐ దుర్గాశేఖర్ రెడ్డి. తన సర్కిల్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందాలు, అసాంఘిక కార్యకలాపాలు, రికార్డింగ్ డ్యాన్సులకు అనుమతిలేదని తేల్చిచెప్పారు. ఆదేశాలు బేఖాతరు చేసి ఎవరైనా బరులు ఏర్పాటు చేస్తే.. ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదని ఆయన హెచ్చరించారు.
మొత్తానికి కోడి పందాలు నిర్వహించొద్దని హైకోర్టు ఎట్టిపరిస్థితుల్లో నిర్వహించే తీరుతామని పందెం రాయుళ్లు అంటుండడంతో కాక్ ఫైట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. మరి ఈ ఉత్కంఠకు తెరపడాలంటే సంక్రాంతి వరకు వేచిచూడాల్సిందే.