ఒక్కొక్కరికీ ఒక్కో లక్కీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అంటే వారికెంతో ఇష్టం, దాన్ని ఫాలో అవ్వడమే వారి ప్రయారిటీ. కేసీఆర్‌కు ఆరు, అదృష్ట సంఖ్య. ఆయన ఏ పని చేపట్టినా, ఆరు కలిసొచ్చేలా చేస్తారు. కానీ ఇదే ఆరు ఒక నాయకుడికి అన్‌లక్కీ నెంబర్‌గా మారింది తెలుసా కేసీఆర్ లక్కీ నెంబర్, ఆ లీడర్‌కు చుక్కలు చూపించింది తెలుసా ఆరు గంటలైనా, ఆరో తారిఖు వచ్చినా, ఆరు ఎక్కడ కనిపించినా, ఎక్కడ వినిపించినా, హడలిపోతున్నాడు ఆ నాయకుడు. ఇప్పటికీ సిక్స్ నెంబర్‌ను కలలోనూ వెంటాడుతోంది ఆ నేతకు. ఇంతకీ కేసీఆర్‌కు అదృష్ట సంఖ్య అయిన ఆరు, ఆ నేతకు దురదృష్ట సంఖ్యగా ఎందుకు మారింది.
ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. టీడీపీలో సీనియర్ నేత. టీడీపీ నేత ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి కొడుకు. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో వీరయ్య చౌదరి మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత రోడ్డు ప్రమాదంలో వీరయ్య చౌదరి మరణించడంతో, తనయుడు నరేంద్ర కుమార్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తర్వాత తిరుగులేని నేతగా పొన్నూరులో ఎదిగారు.
1994 ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ధూళిపాళ్ల నరేంద్ర. తర్వాత 1999 ఎన్నికల్లో కూడా రెండోసారి విజయం సాధించారు. 2004లోనూ, మూడోసారి కాంగ్రెస్ గాలిలో కూడా విజయంతో హాట్రిక్ కొట్టారు. 2009 ఎన్నికల్లో నరేంద్ర నాలుగోసారి పోటీ చేసి ప్రత్యర్థిపై విజయం సాధించారు. 2014 ఎన్నికలు కూడా ధూళిపాళ్ల విజయాన్ని ఆపలేకపోయాయి. అపజయం ఎరుగని నేతగా గుర్తింపు పొందారు. 2019 అంటే, ఆరోసారి పోటీపడ్డారు నరేంద్ర. అదే ఆయనలో టెన్షన్ పుట్టించింది అంటే నమ్మగలరా?
ఐదుసార్లు విజయం సాధించిన వ్యక్తికి, ఆరోసారి పెద్ద లెక్క కాకపోవచ్చన్నది అందరూ చెప్పే మాట. కానీ ఆరోసారి మాత్రం, ధూళిపాళ్లను ఒక అనుమానం వెంటాడింది. తన జైత్రయాత్రకు ఆ సెంటిమెంట్ బ్రేక్ వేస్తుందని ఆయన భయపడ్డారు. ఇంతకీ ఏంటా సెంటిమెంట్ తిరుగులేని నాయకునిలోనూ ఎందుకంత అలజడి.
ఆరో నెంబర్. అవును ఆరో నెంబర్. ఆరో నెంబరే తనను ఓడించిందని, బాధపడుతున్నారు ధూళిపాళ్ల. ఆయన ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నా, ఆరో నెంబర్ సెంటిమెంట్ రిపీట్ కావడం వల్లే, తాను ఓడిపోయానని ఫీలవుతున్నారు ధూళిపాళ్ల. ఇంతకీ పొన్నూరులో ఆరో నెంబర్ సెంటిమెంట్ ఏంటి?
గుంటూరు జిల్లాలో వరుసగా ఐదుసార్లు గెలిచిన ఘనత కోడెల శివప్రసాదరావు, మాకినేని పెదరత్తయ్య, కన్నా లక్ష్మీనారాయణలు మాత్రమే. 2014ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా నరేంద్ర వీరితో సమానంగా చేరారు. అయితే ఆరోసారి బరిలోకి దిగిన ఎవరూ, జిల్లాలో గెలుపొందలేదు. అదే దూళిపాళ్లను కంగారుపెట్టించింది.
2004ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు, మాకినేని పెదరత్తయ్యలు ఆరోసారి పోటీ చేసి ఓడిపోయారు. కన్నా లక్ష్మీనారాయణ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇలా ఐదుసార్లు గెలిచిన ముగ్గురు అభ్యర్థులు రకరకాల కారణాలతో ఓడిపోయారు. ఆరోసారి గెలిచినవారు లేరు. మొన్నటి ఎన్నికల్లో ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ఆరోసారి ఎన్నికల బరిలో దిగారు. ఈ పోరులో నరేంద్ర గెలిస్తే జిల్లాలో ఆరోసారి విజయం సాధించిన తొలి పొలిటీషియన్‌గా చరిత్ర సృష్టించేవారు. ఆరో గండాన్ని గట్టెక్కిన మొనగాడిగా కితాబులందుకునేవారు. కానీ సెంటిమెంట్ రిపీటయ్యిందన్నది ఆయన అభిప్రాయం.
వరుసగా ప్రతి ఎన్నికలోనూ కొత్త ప్రత్యర్థిని ఎదుర్కొంటూ ధూళిపాళ్ళ విజయం సాధించడం ఆనవాయితీగా వచ్చింది. ఇదే సెంటిమెంట్ ఈసారి ఎన్నికలలో కూడా రిపీట్ అవుతుందని టీడీపీ నేతలు ధీమాగా ఉండేవారు. కానీ కొత్త అభ్యర్థి సెంటిమెంట్ రివర్స్ అయ్యింది. ఆరో నెంబర్ దెబ్బకొట్టిందన్నది ఆయన అనుచరుల ఆవేదన. సరే ఆరో నెంబర్ ఆయన నమ్మకం అనుకుందాం. మరి నిజంగా ధూళిపాళ్లను ఓడించిన అసలుసిసలు కారణాలేంటి?
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టుగా ధూళ్లిపాళ్ల నరేంద్ర పరాజయానికి ఎన్నో కారణాలు. నరేంద్ర సొంత సామాజిక వర్గాన్ని నమ్ముకున్నారు. నియోజకవర్గంలో ఆ సామాజికవర్గానికి పెత్తనం ఇవ్వడంతో మిగతా సామాజికవర్గాల్లో అసంతృప్తి పెరిగింది. పొన్నూరులో అత్యధిక ఓట్లున్న కాపులు, బీసీలు దూరమయ్యారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా కాపులకు టికెట్ ఇవ్వలేదు. అయితే వైసీపీ మాత్రం కాపులకే కేటాయించింది. దీంతో ఒక్కసారిగా గేమ్ మారింది. కాపులతో పాటు బీసీలు, ఇతర వెనకబడినవర్గాలు వైసీపీకి అండగా నిలిచాయి.
టిడిపి అధికారంలో ఉన్న టైంలో, ధూళిపాళ్ల నరేంద్ర సోదరుడైన సురేందర్ అక్రమాలు అన్నీఇన్నీ కావని ప్రత్యర్థులు ఆరోపించారు. నరేంద్ర ఓటమికి తమ్ముడు సురేంద్ర ఒక కారణమని స్థానికంగా బలంగా వినిపిస్తోంది. పొన్నూరు పట్టణంలో మైనార్టీలకు చెందిన యాసిన్ నుంచి బలవంతగా కేబుల్ లాక్కోవడంతో మైనార్టీలు దూరమయ్యారు. వైన్ షాప్‌లో వాటాలు, సురేంద్ర బెదిరింపులు, అక్రమాలు, ఇలా తమ్ముడు చేసిన అరాచకాలు, అన్న ఓటమికి దారి తీశాయని విశ్లేషకుల అభిప్రాయం. మొత్తానికి వెంటాడిన ఆరో నెంబర్, తమ్ముడిపై ఆరోపణలు, వైసీపీ సామాజిక వ్యూహాలు, జగన్ వేవ్, ప్రభుత్వ వ్యతిరేకత, ఇలా ఎన్నో కారణాలున్నాయి ధూళిపాళ్ల నరేంద్ర ఓటమికి.