సుజనా "తిన్నావా" అంటున్న టీడీపీ నేతలెవరు?

Update: 2019-06-27 15:19 GMT

ప్రకాశం జిల్లా తెలుగుదేశంలో కొత్త కలవరం మొదలైంది. ముఖ్యంగా సుజనా చౌదరి బీజేపీలో చేరిన నాటి నుంచి, ఆ పార్టీ అగ్రనేతలకు కంటి మీద కునకు లేకుండా పోయింది. ఇంతకీ సుజనా చౌదరి పార్టీ మారడానికి, ప్రకాశం జిల్లా టీడీపీకి లింకేంటి?

ఆంధ‌్రప్రదేశ్‌లో ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలుపెట్టిన బీజేపీ, తెలుగుదేశం నేతలపై ప్రధానంగా కాన్‌సన్‌ట్రేషన్ చేసింది. ఓడిన, గెలిచిన నేతలను తమవైపు లాగేందుకు సకల అస్త్రాలూ ప్రయోగిస్తోంది. ప్రకాశం జిల్లాలోనూ టీడీపీ నేతలకూ వల విసురుతోంది. దీంతో పార్టీ అధినేతకు గుబులు పెరుగుతోంది. వాస్తవానికి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎప్పడూ అంతగా ఆదరణలేదు. ప్రతి ఎన్నికల ఫలితాల్లోనూ ఈ విషయం తేటతెల్లమవుతూనే ఉంది. అయితే 2014 ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయింపులతో కలిపి జిల్లా మొత్తంలో ఉన్న 12 నియోజవర్గాల్లో, 10 సీట్లు టీడీపీవే అన్న ముద్ర వేసింది. కానీ 2019 ఎన్నికల్లో బాగా దెబ్బతింది టీడీపీ.

ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజవర్గాల్లో 8 స్థానాల్లో విజయం సాధించింది వైసీపీ. తెలుగుదేశం మాత్రం రిజల్ట్ రోజున పడుతూ లేస్తూ చివరికి నాలుగు నియోజవర్గాల్లో గెలిచాం అనిపించుకుంది. అయితే గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అయోమయంగా మారింది. దీనికి ప్రధాన కారణం అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి అంతగా బలం లేకపోవడం. దీనికితోడు జిల్లాలో వైసీపీ నాయకులకు జగన్ పదవుల మీద పదవులు ఇస్తుండటంతో, రానున్న కాలంలో జిల్లాలో టీడీపీ పుంజుకుంటుందా అన్న సంశయం తమ్ముళ్లను కలవర పెడుతోంది. జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇవ్వడం, వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడంతో రాబోయే రోజుల్లో, వైసీపీ బలం ముందు తెలుగుదేశం నిలిచే పరిస్థితి ఉందా అని తమ్ముళ్లు సతమతమవుతున్నారు. ఇలా కన్‌ఫ్యూజన్‌లో గింజుకుంటున్న తెలుగు తమ్ముళ్లపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రయోగిస్తోంది కమలం.

ఆంధ్రప్రదేశ్‌లో వికసించాలనుకుంటున్న కమలం నుంచి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలకు సువాసనలు బాగానే వస్తున్నాయట. దీనికి ప్రధాన కారణం సుజనా చౌదరి. సుజనా చౌదరికి జిల్లాతో మంచి సంబందాలున్నాయి. అంతేకాకుండా గత రెండు మూడు పర్యాయాలు అసెంబ్లీ టికెట్ల విషయంలో సుజనా చౌదరి కీలకంగా వ్యవహరించారు. జిల్లాలోని చాలా నియోజవర్గాల నాయకులతో మంచి రిలేషన్స్ ఇప్పటికీ మెయిన్‌టైన్ చేస్తున్నారు. సుజనా ద్వారా జిల్లాలో మరింత బలపడేందుకు వ్యూహాలు రచిస్తోంది బీజేపీ.

సుజనా చౌదరి ఇప్పటికే ప్రకాశం జిల్లాపై దృష్టిపెట్టారన్న చర్చ జరుగుతోంది. కొందరికి ఫోన్లు కూడా వెళ్లాయట. కొందరు స్వయంగా సుజనా చౌదరిని కలిశారట కూడా. ఇప్పటికే చాలామంది జిల్లా టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారని, గ్రీన్‌ సిగ్నల్ ఇస్తే చాలు మూకుమ్మడిగా చేరేందుకు సిద్దమయ్యారని రాజకీయవర్గాల్లో హాట్‌హాట్‌గా డిస్కషన్ జరుగుతోంది. ఇదే టీడీపీలో కలవరానికి కారణమవుతోంది. నిన్న మొన్నటి వరకు బిజేపీని తిట్టినతిట్టు తిట్టకుండా ప్రసంగాలు చేసిన నేతలు, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని సంకోచిస్తున్నారట. విమర్శలు చేసిన నాయకుల పక్కనే ఎలా కూర్చోవాలని మథనపడుతున్నారట. ముందుగా కొంతమంది నాయకులను బిజేపీలోకి పంపి, తర్వాత మరికొందరు వెళ్లేందుకు తమ్ముళ్లు అన్నీ సర్దుకుంటున్నారట. అయితే ఎవరు ఎప్పడు బీజేపీలోకి రావాలో స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేస్తున్నారట సుజనా.

ప్రకాశం జిల్లాపై బీజేపీ, సుజనాను ప్రయోగించడంతో ఎవరెవరు కమలంలోకి వెళతారన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. సుజనాతో టచ్‌లో ఉన్నదెవరని నేతలు చర్చించుకుంటున్నారు. సుజనాతో ముందు నుంచి క్లోజ్‌గా ఉండే నేతలెవరనేదానిపై ఆరా తీసి, అధినేతకు ముందే ఉప్పందించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో కమలం గూటికి భారీగానే వలసలుంటాయన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. అయితే ఇక్కడ కొంత మంది ముఖ్యనేతలు మాత్రం, కమలం నేతలతో టచ్‌లో ఉండి కూడా ఏమీ తెలియనట్లు వ్యవహరించడం కొసమెరుపు.

Full View

Tags:    

Similar News