ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసారు. గత నెల 19న జరిగిన ఎన్నికల్లో వీరిద్దరూ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారు బుధవారం తమ రాజీనామ లేఖను మండలి చైర్మన్ కు అందజేసారు. కాగా మండలి చైర్మన్ వారు అందజేసిన రాజీనామాను పరిశీలించి ఆమోదించారు. అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. కాగా సీఎం జగన్ రాజీనామాల పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలం పాటు ప్రజలకు తమ సేవలను అందిస్తూ ఎంతో సంతృప్తిగా పనిచేసినట్లు చెప్పారు. కౌన్సిల్ రద్దయ్యే వరకు మంత్రిగా కొనసాగినా అభ్యంతరం లేదని సీఎం చెప్పారని వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన శాఖకు సంబంధించి ఏ రోజూ కూడా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోలేదని, పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. పార్లమెంట్‌కు వెళ్లాలన్నది తన చిరకాల కోరిక అని చంద్రబోస్ తెలిపారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ సుదీర్ఘ పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదేమోనని అనుకుంటున్నానని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని వెల్లడించారు.