Varahi Yatra: ఐదో విడత వారాహి యాత్రకు పవన్ కల్యాణ్ సన్నాహాలు
Varahi Yatra: పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్లతో పవన్ సమావేశం
Varahi Yatra: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఐదో విడత వారాహి యాత్రకు సన్నాహాలు స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు నాలుగు విడతల యాత్ర పూర్తిచేసిన జనసేన అధినేత.. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఇక మంగళగిరి వచ్చిన పవన్ కల్యాణ్ ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, వారాహి విజయ యాత్ర ఐదో విడత, జనసేన - టీడీపీ ఉమ్మడి సమన్వయ కమిటీలో చర్చించాల్సిన అంశాలతో పాటు రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు సూచనలు చేశారు పవన్ కళ్యాణ్.
ఇక మొదటి విడత వారాహి యాత్రను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ముగించారు. రెండో విడత విజయ యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రారంభించి తణుకు బహిరంగ సభతో ముగించారు. మూడో విడతలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పవన్ పర్యటన కొనసాగింది. నాలుగో విడత వారాహి విజయయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో కొనసాగింది. ఎక్కడ బహిరంగ సభ జరిగినా స్థానిక అధికార పార్టీ నేతలతో పాటు సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. ఇక ఈసారి ఐదో విడత వారాహి విజయయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై నాదెండ్ల మనోహర్ తో చర్చించారు పవన్ కళ్యాణ్.
మరోవైపు త్వరలోనే ఆ పార్టీ శ్రేణులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మరో వైపు వారాహి విజయయాత్ర ఐదో విడత విజయవంతం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేశారు. ఇటు సినిమాలను పూర్తి చేస్తూనే యాత్రలో పాల్గొనాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ముందుగా ఒప్పుకున్న సినిమాలను డిసెంబర్ లోగా పూర్తి చేసుకుని.. ఇక పూర్తి ఫోకస్ పాలిటిక్స్ పైనే పెట్టేలా రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి మేకప్, ప్యాకప్ ల మధ్య జరుగుతున్న రాజకీయ లక్ష్యాన్ని పవన్ చేరుతారా అనేది ఆసక్తిగా మారింది.