Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆ 12 ఎకరాల భూమి అందుకే కొన్నారా?

Update: 2024-11-06 06:47 GMT

పవన్ కళ్యాణ్ ఫామ్ హౌజ్ ఫోటో

Why Pawan Kalyan purchased 12 acres land in Pithapuram: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూడున్నర ఎకరాల భూమి కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మరోసారి స్థలం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సారి ఏకంగా 12 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 15 ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేశారు. దీంతో పిఠాపురంలో పవన్ కల్యాణ్ భూమి కొనుగోలు అంశం ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ భూమి రిజిస్ట్రేషన్‌ను పవన్ తరపున రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పూర్తి చేసినట్టు సమాచారం. తోట సుధీర్ కొనుగోలు పత్రాలపై సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. పిఠాపురంలో గతంలో కొన్నచోటే మరోసారి భూమిని కొనుగోలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇల్లింద్రాడ రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 13, 28, 29 పరిధిలోని 12 ఎకరాలను పవన్ కొనుగోలు చేశారు. అంతేకాదు నవంబర్ 4న పిఠాపురం పర్యటనకు వచ్చిన పవన్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేస్తానని పవన్ ప్రకటించారు.

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని పేరు ప్రకటించిన తర్వాత ప్రత్యర్థులు అనేక ఆరోపణలు చేశారు. అతిథిలా వచ్చి వెళ్లిపోతారని అసలు పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉండరని విమర్శలు చేశారు. ఆ విమర్శలకు పవన్ తన చర్యలతోనే సమాధానం చెప్పారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయం సాధించిన తర్వాత అక్కడ భూమి కొనుగోలు చేయడం ద్వారా పవన్ తనపై వచ్చిన నాన్-లోకల్ అనే విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారంటున్నారు. అంతేకాకుండా 6 నెలల వ్యవధిలోనే మూడు సార్లు నియోజకవర్గంలో పర్యటించి నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పటికే అక్కడ ప్రజలకు కావాల్సినవి.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా పనులు కూడా ప్రారంభించారు.

గతంలోనే పవన్ 3.5 ఎకరాల స్థలం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు రెండు స్థలాలు తీసుకున్నారు. ఆ భూమి పవన్ కళ్యాణ్ పేరుతోనే రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఇందులో రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ భూమి కొనుగోలు చేసిన ప్రాంతంలో ఎకరం మార్కెట్ విలువ 15-16 లక్షల రూపాయల మేర ఉంటుందని చెబుతున్నారు. తాజాగా 12 ఎకరాలు కొనుగోలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ భూమి విలువ ఎకరా 20 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. అంటే 12 ఎకరాల ధర 2.4 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ భూమిని కొనుగోలు చేసిన ప్రాంతంలో మరికొందరు జనసేన నేతలు కూడా స్థలాలు కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కొందరు నేతలు ఆ ప్రాంతంలో ఉన్న భూమితో పాటు తోటల్ని కొనుగోలు చేశారని గతంలోనే టాక్ వచ్చింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భూమిని కొనుగోలు చేయడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌‌కు మంచి ఊపు వచ్చిందని చెబుతున్నారు. భూముల ధరలు భారీగా పెరిగాయంటున్నారు. అయితే పవన్ కొనుగోలు చేసిన స్థలంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తారా? లేదా ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా అన్నది చూడాలి.

Pawan Kalyan:'నేను హోం మినిస్టర్ అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయి' అని ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకన్నారు? వీడియో కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News