Paritala Sriram: ధర్మవరం పరిటాలకేనా?
Paritala Sriram: నాయకత్వ లేమితో నిన్నటి వరకూ సతమతమవుతన్న ధర్మవరం తమ్ముళ్లకు పరిటాల శ్రీరాం ఇటీవల అండగా నిలవబోతున్నారా?
Paritala Sriram: నాయకత్వ లేమితో నిన్నటి వరకూ సతమతమవుతన్న ధర్మవరం తమ్ముళ్లకు పరిటాల శ్రీరాం ఇటీవల అండగా నిలవబోతున్నారా? ముందు నుంచి ధర్మవరం నియోజకవర్గ బాధ్యతలు చూడమని అధిష్టానం చెప్పినప్పటికీ అంటీముట్టనట్లు వ్యవహరించిన పరిటాల కుటుంబం ఒక్కసారిగా ఎందుకు దూకుడు పెంచింది? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఇటీవల అధినేతను కలిసిన శ్రీరాం రాప్తాడు కన్నా ధర్మవరంపైనే ఎక్కువగా ఫోకస్ చేయడానికి కారణాలేంటి? ధర్మవరం టీడీపీలో ఏం జరుగుతోంది.? ఇక ధర్మవరం పరిటాలకేనా?
ఎట్టకేలకు ధర్మవరం టీడీపీకి ఓ నాయకుడు వచ్చాడంటున్నారు తమ్ముళ్లు. 2019 ఎన్నికల తర్వాత నాయకత్వ లేమితో మథన పడుతున్న తమ్ముళ్లకు ఊరట లభించిందట. విపక్షంలోకి వెళ్లాక పార్టీకి పెద్ద దిక్కు లేకపోవడంతో ఇన్నాళ్లు కలత చెందామంటున్న టీడీపీ క్యాడర్‌కు ఎట్టకేలకు గట్టి భరోసా దొరికిందట. కొంతకాలంగా ధర్మవరం విషయంలో సైలెంట్‌గా ఉన్న పరిటాల శ్రీరాం అనూహ్యంగా యాక్టివ్ అయ్యారన్న చర్చ జరుగుతోంది. చిన్న సమస్య వచ్చినా గట్టిగా ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీస్తూ అండగా నిలుస్తూ వస్తున్నాడంటూ తమ్ముళ్లు శ్రీరామ్‌ను భుజానికెత్తుకుంటున్నారు. అటు పరిటాల ఎంట్రీ ఇవ్వడమే కాదు యాక్టివ్ కూడా అవడంతో పార్టీలోనూ జోష్ పెరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది.
మొన్నీ మధ్య ధర్మవరంలో మార్కెట్ కూలగొట్టిన విషయంలో శ్రీరాం బాధితులకు అండగా నిలిచారు. అక్కడే ఆందోళన చేపట్టారు. ప్రతిపక్షాలను కలుపుకొని కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే కాదు, అంతకుముందు నియోజకవర్గంలో పాత బిల్లుల బకాయిల కోసం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ జరుగుతున్న పరిణామాలపై పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తూ వారికి భరోసా ఇస్తున్నారు.
మొన్నటివరకు రాప్తాడుకే పరిమితమైన శ్రీరాం ధర్మవరానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లేవారు. గత ఎన్నికల్లో ధర్మవరం నుంచి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ కొద్ది రోజులకే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనుకోని ఈ ఘటనతో టీడీపీలో పెద్ద కుదుపు వచ్చింది. అనంతపురం పర్యటనకు వచ్చినప్పుడు ధర్మవరం బాధ్యతలు చూడాలని పరిటాల కుటుంబాన్ని చంద్రబాబు ఆదేశించారు.
అప్పటికీ ధర్మవరం ఇన్‌చార్జ్ ఎవరో చెప్పాలంటూ పదేపదే అధినాయకత్వాన్ని కోరినా పరిటాల కుటుంబంలో ఎవరో ఒకరు ఉంటారి చెబుతూ వచ్చారే కానీ, క్లారిటీ ఇవ్వలేదు. ఇటు ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇచ్చినప్పటికీ పరిటాల శ్రీరాం, సునీత ధర్మవరంపై మొన్నటి వరకూ అంతగా ఫోకస్ చేయలేదు. పార్టీ కార్యక్రమాలు, తప్పని పరిస్థితుల్లో అడపాదడపా చుట్టపుచూపుగా వచ్చివెళ్లారు. చాలాసార్లు పార్టీ నేతలు, కార్యకర్తలు ఒత్తిడి చేసినప్పటికీ పూర్తిస్థాయిలో పరిటాల కుటుంబం దృష్టి సారించలేదు. అలాంటి ఇటీవల పరిటాల శ్రీరాం ధర్మవరం నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరిస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
పార్టీ ఆదేశాలో, అధినేత సూచనలో కానీ, పార్టీ కార్యక్రమాలు ఏవైనా ముందుండి నడిపిస్తున్న శ్రీరామ్. ఎప్పటికప్పడు నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్‌కు భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వంపైనా స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపైనా ఘాటైన వాఖ్యలు చేస్తున్నారు. శ్రీరాం యాక్టివ్ కావడంపై పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ పలురకాలుగా చర్చ జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్‌లో పరిటాల శ్రీరాం చంద్రబాబు, లోకేష్‌ను కలిసి వచ్చారని ధర్మవరంపై దృష్టి సారించాలని బాబు ఆదేశించడంతోనే యాక్టివ్ అయ్యారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో టికెట్ పక్కాగా పరిటాల కుటుంబానికే వస్తుందన్న అంచనాతో పరిటాల అభిమానులు, క్యాడర్ కూడా ధర్మవరాన్ని చుట్టేస్తున్నారట.
నిజానికి కూడా, ముందు నుంచి ధర్మవరంలో పరిటాల కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. తాజాగా అధికార పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్లు, ఇబ్బందులు తట్టుకొని నిలబడిన కార్యకర్తలు, నాయకులను కాపాడుకోవాలన్న అధిష్టానం ఆదేశాలతోనే పరిటాల శ్రీరాం ధర్మవరంపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై రాప్తాడు తరహాలోనే ధర్మవరంలోనూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటానని శ్రీరాం క్యాడర్‌కు చెబుతున్నారట. ఇప్పటికే నియోజకవర్గంలో నాయకత్వంపై క్లారిటీ వచ్చిందని, పరిటాల కుటుంబం ధర్మవరంపై కాన్సంట్రేషన్ చేయడం ఇందులో భాగమేనని చెబుతున్నారు. మరి, ధర్మవరంలో శ్రీరాం పాగా వేస్తారా ఆ కుటుంబం నుంచి మరెవరైనా వస్తారో కాలమే సమాధానం చెప్పాలి.