Votes Counting: ఇవాళ ఏపీ పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌

Votes Counting: కాసేపట్లో ప్రారంభంకానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

Update: 2021-09-19 01:20 GMT

నేడు ఏపీలో పరిషరత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు (ఫైల్ ఇమేజ్)

Votes Counting: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఏపీ పరిషత్‌ ఎన్నికల ఫలితాల విడుదలకు సమయం ఆసన్నమైంది. ఈ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.. అన్ని కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రంలోని 209 కేంద్రాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 8న పోలింగ్‌ జరగగా.. దాదాపు ఆరు నెలల పాటు అటు అభ్యర్థుల్లోనూ ఇటు పార్టీల్లోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే నేటితో తెర పడనుంది.

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 660 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. వివిధ కారణాలతో 8 మండలాల్లో ఎన్నికలు జరగలేదు. వాటిలో 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే.. సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో 11 మంది అభ్యర్థులు చనిపోవడంతో ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మిగిలిన 515 జెడ్పీటీసీ స్థానాలకు 2వేల 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం ఎంపీటీసీ స్థానాలు 10వేల 47 కాగా అందులో 2 వేల 371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పలు కారణాలతో 375 స్థానాల్లో పోలింగ్‌ నిలిచిపోగా.. పోటీదారుల్లో 81 మంది మరణించారు. దీంతో మిగిలిన 7వేల 220 స్థానాలకు 18 వేల 782 మంది అభ్యర్థులు పోటీకి దిగారు.

మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు హాజరయ్యే సిబ్బంది, ఏజెంట్లు తప్పనిసరిగా కోవిడ్‌ వ్యాక్సినేటెడ్‌ అయి ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ స్పష్టం చేశారు. అలాగే.. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. కౌంటింగ్‌ సజావుగా సాగేందుకు 11వేల 803 మంది కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, 32వేల 264 కౌంటింగ్ సిబ్బంది ఉంటారన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కార్యాలయాల్లో 13 మంది అధికారులు పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్‌ పూర్తయిన వెంటనే ఫలితాలు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.

Tags:    

Similar News