ఏపీ స్థానిక ఎన్నికలపై విచారణ వాయిదా
-వ్యాక్సినేషన్‌కు నోటిఫికేషన్ అడ్డుగా లేదన్న ఎస్‌ఈసీ -ఎస్‌ఈసీ రిట్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్న ప్రభుత్వం
ఏపీలో ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య ఆధిపత్య పోరు కంటిన్యూ అవుతోంది. ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఎస్‌ఈసీ ముందుకెళ్తుంటే.... ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటోంది. అయితే, ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలను ఎస్‌ఈసీ సవాలు చేయడంతో హైకోర్టు వాడివేడిగా వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు లేకుండానే నోటిఫికేషన్ ఉందని ఎస్‌ఈసీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే, వాక్సినేషన్ కార్యక్రమంలో 23 ప్రభుత్వ శాఖలు పాల్గొంటున్నాయని, రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులను అర్ధంచేసుకోవాలంటూ హైకోర్టుకు ఏజీ విజ్ఞప్తి చేశారు. అసలు, ఎస్‌ఈసీ రిట్ పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ ప్రభుత్వం వాదించింది. ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని తెలిపింది.
కరోనా వ్యాక్సినేషన్ ఉన్నందున ఇప్పుడు ఎన్నికలు వద్దంటూ ఎస్‌ఈసీకి సీఎస్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి లేఖలు రాసినా ....పరిగణలోకి తీసుకోకుండా, దురుద్దేశంతోనే ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిందని కోర్టుకు తెలిపారు ఏజీ. దాంతో, కరోనా వ్యాక్సినేషన్ ఎలా జరుగుతోంది? రోజుకి ఎంతమందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు? వ్యాక్సిన్ వేస్తున్న సిబ్బందికి శిక్షణ ఇచ్చారా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ కిందకి ఎవరెవరు వస్తారు? 50ఏళ్లలోపు వారికి ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తారంటూ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. దాంతో, హైకోర్టు ప్రశ్నలకు ఆధారాలతో సహా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అనంతరం, కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.