తిరుమలపై నివర్ తుపాను ప్రభావం
* తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం * ఎడతెరిపిలేని వర్షంతో శ్రీవారి దర్శనానికి తడుస్తూ వెళుతున్న భక్తులు * తిరుమల ఘాట్ రోట్లపై దట్టంగా కమ్ముకొన్న మంచు
Nivar Cyclone Live Updates : నివర్ తుపాను ప్రభావం తిరుమలపై పడింది. తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపిలేని వర్షంతో శ్రీవారి దర్శనానికి తడుస్తూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరో రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తిరుమల కొండల్లో దట్టమైన పొగ మంచు అలుముకొని ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతోంది.
అటు భారీ వర్షానికి చలి గాలుల తీవ్రత కూడా తోడవడంతో నడక దారిలో వస్తున్న భక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుమల తిరుపతికి ప్రయాణించే రెండు ఘాట్ రోడ్లలో అలుముకున్న పొగ మంచు కారణంగా వాహన రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. పది అడుగులు దూరంలో ఏమున్నాయో తెలియనంతగా మంచు కమ్మేయడంతో వాహనదారులు ఆచి తూచి ముందుకు సాగుతున్నారు. టీటీడీ కూడా ఘాట్ రోడ్లలో రాకపోకలు సాగించే ప్రయాణికులకు తగిన సూచనలు చేస్తూ ఘాట్ రోడ్లోకి అనుమతిస్తున్నారు.