Andhra Pradesh: ఏపీలో కొత్తజిల్లాల్లో కొత్త సమస్యలు
Andhra Pradesh: ఒక్కో జిల్లాలో వేర్వేరుగా రెవెన్యూ, పంచాయతి డివిజన్లు
Andhra Pradesh: పాలనలో మార్పులొచ్చాయి. భౌగోళికంగా సరిహద్దులు మారాయి. మౌలిక సదుపాయాలకల్పనలో ముందుచూపులేమి ప్రభుత్వ పనితీరుకు అద్దంపడుతోంది. పాలకులు అనుకున్నది చేశారేతప్ప అధికారులు చేయాల్సిన పనులు కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వ లెక్కల్లో మార్పులు కొత్తరికార్డుల రూపకల్పన జరిగింది. క్షేత్రస్థాయిలో పాలనా సస్కరణల్లో ఆశించిన ఫలితాలు కానరాకున్నాయి. పాలకుల ఆలోచన కార్యరూపందాల్చిందిగానీ అందుకు అనుగుణంగా పూర్తిస్థాయిలో అధికారుల నియామకం జరుగకపోవడంతో పాలన గాడితప్పుతోందనే పరిస్థితులు ప్రగతికి ప్రతిబంధకంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటు అన్నీకొత్తదనాన్ని సంతరించుకున్నాయి. కొత్తమంత్రులొచ్చారు. అన్నీ కొత్తగా మారాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన పంచాయతి శాఖకు సంబంధించిన అధికారుల నియామకం చేపట్టలేదు. జిల్లా పోస్టుల్ని కేటాయించినప్పటికీ ఆయా స్థానాల్లో అధికారుల నియామకం జరుగులేదు. రెవెన్యూ డివిజన్లు, పంచాయతి డివిజన్లు ఏర్పాటు చేశారు. కార్యాలయాల నిర్వహణ పనితీరునుపర్యవేక్షించే అధికారులు లేదు. కార్యకలాపాలను సవ్యంగా సాగించే ఉద్యోగులూ లేరు.
కొత్త జిల్లాల పాలనకోసం జగన్ సర్కారు ముహూర్తం కుదుర్చుకుని హడావుడిగా పాలన ప్రారంభించింది. 26 జిల్లాలల్లో పాలనా సౌలభ్యంకోసం రెవెన్యూ డివిజన్లు, పంచాయతి డివిజన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లుంటే పంచాయతీలకు మూడు డివిజన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో పంచాయతి డివిజన్ పరిధిలో 200నుంచి 500 గ్రామాలను ఒక్కో డివిజన్ గా పరిగణించారు. గ్రామాల్లో అభివృద్ధిపనులు, పంచాయతీలవారిగా నిధుల కేటాయింపుల వంటి కార్యకలాపాలకు నివేదికల రూపకల్పన, ప్రతిపాదనల ఆమోదవ్యవహాలను చూసుకునే పంచాయతీ అధికారులు లేకపోవడంతో కొత్తజిల్లాల అభివృద్ధికి ఆటంకంగా మారింది. ఏపీలో ఎక్కడా అభివృద్ధికి సంబంధించి కొత్త ప్రతిపాదనలుగానీ వాటికి పాలనాపరంగా ఆమోదముద్రగానీ పడే అవకాశాలే లేకుండా పోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలుగానీ, కొత్త పనులు గానీ ఇప్పట్లో ప్రారంభం కాదని తెలుస్తోంది.
కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటికీ జిల్లా పరిషత్ వ్యవస్థలో మార్పులు కన్పించడంలేదు. జిల్లా పరిషత్ ల పాలనా వ్యవధికాలం పూర్తిగాకపోవడంతో విభజన సమస్యగా మారింది. మరో మూడేళ‌్లు గడిస్తేగానీ జిల్లా పరిషత్ కార్యాలయాలు కొత్త జిల్లాల్లో పూర్తిస్థాయిలో పనిచేయబోవని స్పష్టంగా తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,042 గ్రామాలున్నాయి. జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉన్నప్పటికీ డివిజినల్ పంచాయతీ కార్యాలయాలు మాత్రం మూడే ఉన్నాయి. గుంటూరు డివిజన్ పరిధిలో 254, తెనాలి డివిజన్‌లో 237 గ్రామాలు ఉన్నాయి. నరసరావుపేట, గురజాల రెవెన్యూ డివిజన్లు ఉన్నప్పటికీ పంచాయతీ శాఖలో మాత్రం నరసరావుపేట డివిజినల్ కార్యాలయం ఒక్కటే ఉంది. ఈ ఒక్క డివిజన్‌లోనే 527 గ్రామ పంచాయతీలున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పల్నాడు జిల్లాలో మరో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. పంచాయతీ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత లేదు. కొత్త జిల్లాలకు పంచాయతీ అధికారుల నియామకంలో ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. కొత్త జిల్లాలుగా ఏర్పడిన పల్నాడు ఉన్న జిల్లాల్లో పెద్దది. పంచాయతీ డివిజన్‌లను పెంచుతారా లేక ఒక్కదానిగానే కొనసాగిస్తారా అన్నది ఉద్యోగుల్లోనూ చర్చ జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు సమయానికే జిల్లా పంచాయతీ అధికారిని నియమిస్తారని అంతా భావించినా ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వం ఒకవేళ అధికారులను నియమిస్తే, డివిజన్లను అదనంగా ఏర్పాటు చేస్తారా లేదా అన్నది ఉద్యోగుల్లో చర్చకు వస్తున్న అంశాలు.
అసలే కొత్త కాపురం. జిల్లాల ప్రకటించినప్పటికీ అధికారికంగా పాలన కొనసాగుతున్న జిల్లా అధికారులు పూర్తి కార్యాలయాలు ఏర్పాటైతేగానీ పాలనలో మార్పులు అభివృద్ధి సాధ్యంకాదని స్పష్టంగా తెలుస్తోంది.