ఇవాళ గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఇందుకోసం పార్టీ యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సందర్బంగా గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడికొండ , తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగనుంది. ఆయా ప్రాంతాల్లో వరద ప్రభావానికి గురై దెబ్బతిన్న పంటల్ని ఆయన పరిశీలించనున్నారు. జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలతో వేల ఎకరాల్లో దెబ్బతిన్న నేపథ్యంలో ఇవాళ కృష్ణా కరకట్ట ప్రాంతాల్లోను, లంక గ్రామాల్లోను పరిస్థితుల్ని టీడీపీ బృందం పరిశీలించనుంది.
అనంతరం రైతులకు నష్టపరిహారాన్ని ఇచ్చేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనుంది. నారా లోకేశ్ పర్యటన సందర్బంగా టీడీపీ నేతలు నిన్న ఆయన ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. కాగా లోకేశ్ వెంట మాజీ మంత్రి నక్కా ఆనందబాబు.. తెనాలి, తాడికొండ మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్ , శ్రవణ్ కుమార్ లు పాల్గొనే అవకాశం ఉంది. నారా లోకేశ్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పట్లను సమీక్షించారు.