Andhra Pradesh: రేపే ఛైర్మన్ ఎన్నిక..తాడిపత్రిలో వేడెక్కిన రాజకీయాలు
Andhra Pradesh: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలివీచింది.
Andhra Pradesh: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలివీచింది. అయితే కడపజిల్లాలోని మైదకూరు, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మాత్రం టీడీపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో టీడీపీకి ఆధిక్యం రావడంతో ఛైర్మన్ పీఠాన్ని దక్కుంచుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే అటు వైసీపీ కూడా ఏమాత్రం పట్టువిడవకుండా ఛైర్మన్ పదవి కోసం గాలం వేస్తోంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
అనంతపురం జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. రేపే మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో జేసీ క్యాంప్‌లో సీపీఐ, ఇండిపెండెంట్లు కలిపి 20 మంది అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు తాడిపత్రిలో అధికార, ప్రతిపక్షాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వైసీపీ కార్యకర్త బైక్‌కు గుర్తుతెలియని వ్యక్తులు కొందరు నిప్పు పెట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా కానున్నాయి. ఎక్స్ అఫీషియో ఓటర్లు నమోదు చేసుకున్నవారికి మున్సిపల్ కమిషనర్ షాకిచ్చారు. ఎక్స్ అఫీషియో ఓటు కోసం టీడీపీతో పాటు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా దరఖాస్తు చేసుకోగా.. మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి తిరస్కరించారు. తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక కోసం ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కావడంతో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు గోపాల్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, ఇక్బాల్ అహ్మద్, శమంతకమణి కూడా దరఖాస్తు చేసుకోగా.. మున్సిపల్ కమిషనర్ తిరస్కరించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలకు మాత్రమే అర్హత ఉంటుందని స్పష్టం చేశారు.
తాడిపత్రిలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. టీడీపీ 18 సీట్లు గెలుచుకుంటే.. వైసీపీ 16 సీట్లతో సరిపెట్టుకుంది. ఎక్స్ అఫీషియో ఓట్ల సాయంతో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని వైసీపీ భావిస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ వైసీపీకి చెందిన వారే కాబట్టి రెండు పార్టీలకు సమాన ఓట్లు పడే అవకాశముంది. అయితే ఇక్కడ ఎమ్మెల్సీ స్థానం టీడీపీ ఖాతాలో ఉంది. కానీ ఎమ్మెల్సీలను ఎక్స్ అఫీషియో ఓట్లుగా పరిగణలోకి తీసుకోలేమని తాడిపత్రి పురపాలక ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా రసవత్తరంగా మలుపు తీసుకుంది.
మరోవైపు అనంతపురం నగర మేయర్‌గా మహమ్మద్ వసీం సలీం పేరు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్లుగా మహాలక్ష్మీ, విజయభాస్కర్ రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక కాసేపట్లో మంత్రి బొత్స సత్యనారాయణ అధికారికంగా పేర్లను ప్రకటించనున్నారు.