Kurnool: బన్నీ ఉత్సవంలో చెలరేగిన హింస
*దేవరగట్టు కర్రల సమరంలో 100 మందికిపైగా గాయాలు *ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో చెలరేగిన హింస
Kurnool: కర్నూలు జిల్లా దేవరగట్టులో దశాబ్దాలుగా కొనసాగుతున్న కర్రల సమరంలో హింస చెలరేగింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు చేపట్టిన చర్యలు ఫలించలేదు. కొవిడ్ నిబంధనలు గాలికి వదిలేసి ఉత్సవం చేపట్టారు. 100మందికి పైగా గాయపడ్డప్పటికీ ప్రాణహాని తప్పటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
భక్తి, విశ్వాసం ముసుగులో దేవరగట్టులో ప్రతి ఏడాది కర్రల సమరం నిర్వహించటం ఆనవాయితీ. మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరం ఉత్సవ విగ్రహాలను కైవసం చేసుకునేందుకు దేవరగట్టు ప్రాంతంలోని 12 గ్రామాల ప్రజలు కర్రల సమరంలో పాల్గొన్నారు. నెరణికి, నెరణికి తాండా, కొత్తపేట గ్రామాల ప్రజలు ఒక జట్టుగా ఆలూరు, సుళువాయి, ఎల్లార్తి, అరికెర, నిడ్రవట్టి, బిలేహాల్ గ్రామాల ప్రజలు మరో జట్టుగా ఏర్పడి కర్రలతో తలపడ్డారు. ఈ యుద్ధంలో తలలు పగిలి రక్తమోడినా భక్తులు మాత్రం కర్రల సమరాన్ని ఆపలేదు.