నేడు ఉదయగిరిలో మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు
*నెల్లూరులోని గౌతమ్ రెడ్డి ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర
Mekapati Goutham Reddy Funeral: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఉదయగిరిలో నిర్వహించనున్నారు. నెల్లూరు డైకాస్ రోడ్డులోని మేకపాటి నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం అయ్యింది. అంతిమ యాత్రలో రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు. పార్థివదేహానికి పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరు పాలెం, మర్రిపాడు, సరిహద్దు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీగుదా ఉదయగిరిలోనే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూర్ లో కొద్దిసేపు పార్థివదేహాన్ని నిలిపి ప్రజలకు కడసారిచూపుకు అవకాశం కల్పించనున్నారు. 11 గంటల తర్వాత అంతిమ సంస్కారాలకు ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజి ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డిని కడసారి చూసేందుకు తరలివస్తున్న ప్రజానికంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, ప్రముఖులు వస్తుండటంతో భారీ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ఉదయం పది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి 10 గంటల 45 నిమిషాలకు కడప ఎయిర్ పోర్టు చేరుకుంటారు. 10 గంటల 55 నిమిషాలకు కడప ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో ఉదయగిరికి బయల్దేరి వెళ్తారు. మేకపాటి అంతిమ సంస్కారాలు నిర్వహించే మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి కడప వెళ్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.