ఏపీలో జిల్లాల విభజన,అభ్యంతరాలపై కలెక్టర్లతో సమావేశాలు
*నాలుగు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్న అధికారులు
Andhra Pradesh: ఏపీలో కొత్త జిల్లాలకు మరో అడుగు పడుతుంది. గత నెలాఖరును ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాలకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అభ్యంతరాలు.. సలహాలు, సూచనలపై ఇవాళ్టి నుంచి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల్లో కలిపి రెండు వేలకు పైగా ఆర్జీలు అందాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఒక వెయ్యి 478 అభిప్రాయాలు, అభ్యంతరాలు వచ్చాయి. ప్రజాప్రతినిధులు, వివిధ ఉద్యోగ, ప్రజా సంఘాలు ప్రభుత్వానికి వినతులు ఇచ్చారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో ఏడు వందల వినతులు రాగా.. శ్రీకాకుళం జిల్లాలో కేలం 16 విజ్ఞప్తులు అందాయి. మార్చి మూడవ తేదీ వరరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉన్నా.. ముందుగానే ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించడంపై చర్చకు దారి తీసింది. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారంభించే విధంగా సన్నాహాలు సాగుతున్నాయి.
ఏపీలోని 13 జిల్లాల కలెక్టర్లతో ఈనెల 28 వ తేదీ వరకు విజయవాడ, తిరుపతి, అనంతపురం, విశాఖ పట్నం నగరాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాల విభజనపై వచ్చిన విజ్ఞప్తుల గురించి ఈ సమావేశాల్లో జిల్లాల కలెక్టర్లు వివరించాలని రాష్ర్ట ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ విజయవాడలో కృష్ణా, పశ్చిమ గోదారి, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రేపు తిరుపతిలో చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో, ఈనెల 26న అనంతపురంలో అనంతపురం, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో, 28న విశాఖ పట్నంలో విశాఖ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగర్ జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు జరగనున్నాయి.