ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం వచ్చినా వారి తలరాత మాత్రం మారడం లేదు. పచ్చని అడవులను నాశనం చేస్తున్నారు. విశాఖ జిల్లా అడవుల్లో ఉన్న లేట్ రైట్ పైన మాఫియా కన్ను పడింది. ఈ విలువైన ఖనిజాన్ని తవ్వేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గిరిజనుల పేరు మీదుగా అనుమతులు పొంది లబ్ధి పొందాలని చూస్తున్నారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం సరుగుడు పంచాయితీ పరిధిలో లేట్ రైట్ ఖనిజం అపారంగా ఉంది. ఈ భూములపై చట్ట పరమైన హక్కులు, రాజ్యాగ పరమైన రక్షణలు ఈ పంచాయితీ గిరిజనులకు ఉన్నాయి. ఇక్కడ వున్న లేట్ రైట్ తవ్వేందుకు తప్ప గిరిజన చట్టాల అమలు, వారి సంక్షేమం ఏ ప్రభుత్వనికి పట్టడం లేదు.
అయితే ప్రస్తుతం సరుగుడు పంచాయతీలో కొత్త దద్దుగులలో సర్వే నెంబరు 533లోని 22హెక్టార్లలో ఉన్న లేట్ రైట్ తవ్వకాలకు అనుమతుల మంజూరుకు ప్రయత్నం జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం ఈ మారుమూల ప్రాంతంలోకి జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పర్యటించడం అనుమానాలకు తావిస్తుంది. ఈ అనుమతులు కోసం గిరిజనుడైన ఒక వ్యక్తి పేరున దరఖాస్తు పెట్టించారని అక్కడి వారు చెప్తున్నారు.
అసలు ఈ తవ్వకపు అనుమతులు పొందాలంటే పిసా చట్టం ప్రకారం గ్రామ సభ అనుమతి, అటవి హక్కుల చట్టం గ్రామ కమిటి అమోదం తప్పని సరిగా ఉండాలి. కానీ, కాంట్రాక్టర్లు అవేమీ పట్టించుకోకుండా బినామీల పేరు మీదుగా ఈ మైనింగ్‌ను తవ్వి ఖజనా నింపుకోవాలని చూస్తున్నారు. అభివృద్ధి మాటే ఎరుగని గిరిజనులకు మైనింగ్ మాఫియా చుక్కలు చూపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అడవిని నాశనం చేసే మైనింగ్ తవ్వకాలు జరిపితే తాము ఊరుకోమని ఆదివాసులు తెగేసి చెప్తున్నారు.