ఏపీలో పంచాయతీ ఎన్నికల వార్ ఊపందుకుంది. ఇవాళ్టితో తొలి విడత నామినేషన్ల పర్వం ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 4న అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం, ఎస్‌ఈసీల మధ్య వివాదం ముదురుతోంది. ఏపీ సీఎస్‌కు నిమ్మగడ్డ వరుసగా లేఖలు సంధిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను గుర్తు చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ లేఖ రాశారు. ఉద్యోగులను బదిలీ చేయాలంటూ లేఖల మీద లేఖలు రాస్తున్నారు. ఉద్యోగులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కచ్చితంగా ఎన్నికల కోడ్‌ను పాటించాలన్నారు.
ఇక ఏపీ జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తొలగింపు ఆదేశాలు అమలు కాకపోవడంపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ జరపకుండా చేశారని, జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్ తన ఆదేశాలను పట్టించుకోలేదనే కారణంతో విధుల నుంచి తొలగించాలని సీఎస్‌కు సూచిస్తూ గతంలో లేఖ రాశారు. అధికారులను సన్నద్ధం చేయడంలో విఫలమయ్యారని, అందుకే ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తన ఆదేశాలు అమలు కాకపోవడంతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్‌ఈసీ మరోసారి లేఖ రాశారు. తన ఆదేశాల ఉల్లంఘనపై తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
టీడీపీ అధిష్టానానికి ఎస్‌ఈసీ లేఖ రాశారు. టీడీపీ పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోపై వివరణ కోరారు ఆయన. ఫిబ్రవరి 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని లేఖలో పేర్కొన్న ఎస్‌ఈసీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక ఇచ్చిన మేనిఫెస్టోపై చర్యలుంటాయన్నారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో మేనిఫెస్టో సరైనది కాదన్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.