ఏపీలో పంచాయతీ ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంది. మూడు జిల్లాల ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన గంటల వ్యవధిలోనే లేఖాస్త్రాలు మొదలయ్యాయి. పంచాయతీ సమరంలో క్షేత్రస్ధాయి కుమ్ములాట ఇంకా ప్రారంభం కాకుండానే పతాక స్థాయి కుమ్ములాట పీక్స్ కు చేరుతోంది.
ఏపీ ప్రభుత్వం- ఏపీ ఎన్నికల కమిషనర్ మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. మంత్రులు, సలహాదారుల వాహనాల వినియోగంపై ఆంక్షలు విధిస్తూ నిమ్మగడ్డ లేఖ రాశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదని ఎస్ఈసీ స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలు ఉపయోగించకుండా చూడాలని సీఎస్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ కోరారు.
ఇక ఏపీ జీఏడీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తొలగింపు ఆదేశాలు అమలు కాకపోవడంపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్ జరపకుండా చేశారని, జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్ తన ఆదేశాలను పట్టించుకోలేదనే కారణంతో విధుల నుంచి తొలగించాలని సీఎస్‌కు సూచిస్తూ గతంలో లేఖ రాశారు. అధికారులను సన్నద్ధం చేయడంలో విఫలమయ్యారని, అందుకే ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తన ఆదేశాలు అమలు కాకపోవడంతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్‌ఈసీ మరోసారి లేఖ రాశారు. తన ఆదేశాల ఉల్లంఘనపై తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
చంద్రబాబు ఎజెండాలో భాగంగానే ఎస్ఈసీ జిల్లాల పర్యటన జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. పదవి ఇచ్చిన చంద్రబాబు రుణం తీర్చుకోవాలని నిమ్మగడ్డ భావిస్తున్నారన్నారని విమర్శించారు. టీడీపీని చిత్తుగా ఓడించారని వైసీపీపై నిమ్మగడ్డ కక్ష సాధిస్తున్నారన్నారు. జిల్లాల పర్యటనల్లో నిమ్మగడ్డ రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని దివంగత నేత వైఎస్సార్ అంటే తనకు అభిమానమని నిమ్మగడ్డ అంటున్నారు.. 2009లో ఆయన మరణిస్తే 2021లో నిమ్మగడ్డకు అభిమానం పుట్టుకొచ్చిందా అంటూ వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు.