Land Kabza in Bobbili: బొబ్బిలిలో భూ బకాసురులు

Update: 2020-08-01 05:35 GMT

Land Kabza in Bobbili: పేదల కోసం గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలను కేటాయించింది. అప్పటి అధికార పార్టీ నాయకులు చక్రం తిప్పారు. బినామీల పేర్లతో పట్టాలు చేజిక్కించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. రెవిన్యూ శాఖ అధికారుల అండదండలతో లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. నాలుగేళ్ల నుంచి నిజమైన పేదలు పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారం ఎమ్మెల్యే విచారణకు ఆదేశించడంతో అక్రమాల డొంక కదులుతోంది. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఇందిరమ్మ కాలనీ ఇళ్ల గోల్ మాల్‌పై స్పెషల్ స్టోరీ.

విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఇందిరమ్మ కాలనీలో భూ బకాసురులు, రెవిన్యూ అధికారులు కుమ్మక్కయారు. పేదల ఇళ్ల స్థలాలను కబ్జారాయుళ్లు ఆక్రమించి, సొమ్ము చేసుకుంటున్నారు. అసలైన పేదలు ఇళ్ళ స్థలాలు అందక అద్దె ఇళ్లలో బతుకు వెళ్లదీస్తున్నారు. 2016 - 2019 సంవత్సరంలో ఇందిరమ్మ కాలనీ మూడవ ఫేజ్ క్రింద ప్రభుత్వం 600 పట్టాలను మంజూరు చేసింది. అప్పటి అధికార టీడీపీ నాయకులు చక్రం తిప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 40 స్థలాలను ఆక్రమించి ఇళ్లు కట్టి 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు అమ్ముకున్నారు. ఇప్పటికీ కొందరు నాయకులు బినామీ పేర్లతో పట్టాలు ఉంచుకుని, రియల్ దందా చేస్తున్నారు.

శ్రీనివాస రావు అనే వ్యక్తికి 2017లో పట్టా ఇచ్చారు. పట్టా మంజూరు చేసిన స్థలంలో భారీ టవర్ ఉంది. టవర్ కింద ఇల్లు ఎలా కట్టుకోవాలని శ్రీనివాసరావు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవిన్యూ ఉద్యోగుల అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇందిరమ్మ కాలనీలో భూ కబ్జాలపై రెవిన్యూ శాఖకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆక్రమణదారులపై చర్యలు తీసుకోని, నిజమైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే పేదలతో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామని హచ్చరిస్తున్నాయి. ఇందిరమ్మ కాలనీ భూ ఆక్రమణలపై పేదలు ఫిర్యాదు చేయగా, ఎమ్మెల్యే విచారణకు ఆదేశించారు. రెవిన్యూ శాఖ రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో కంగారు మొదలైంది. ఇప్పుడైనా తమకు పట్టాలు దక్కుతాయేమోనని పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Full View



Tags:    

Similar News