టీటీడీ చైర్మన్ తో జవహర్ రెడ్డి భేటీ.. రేపు బాధ్యతల స్వీకరణ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి కెఎస్ జవహర్ రెడ్డి గురువారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి కెఎస్ జవహర్ రెడ్డి గురువారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సుబ్బారెడ్డి ఆఫీసులో ఈ భేటీ జరిగింది. ఈ సందర్బంగా సామాన్యభక్తుల దర్శనం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బావుంటుందనే విషయం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.. అంతేకాకుండా ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు, పలు అంశాల గురించి వారు చర్చించినట్టు సమాచారం. భేటీ అనంతరం జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇన్నాళ్లుకు శ్రీవారి సేవ చేసుకునే భాగ్యం తనకు దక్కిందని.. ఇది జీవితంలో తనకు దక్కిన వరంలా భావిస్తున్నానని అన్నారు.
ఇక వైద్యారోగ్య శాఖలో నాడు-నేడు కార్యక్రమం కొత్త ఒరవడిని సృష్టిస్తుందని.. ఈ మహత్తర కార్టక్రమంలో తాను భాగస్వామ్యం అవ్వడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు. కాగా కేఎస్ జవహర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవోగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. కుటుంబసభ్యులతో నేరుగా తిరుమలకు చేరుకుంటారు.. తాత్కాలిక ఈవో ధర్మారెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ అలాగే కొందరు సభ్యులు కూడా పాల్గొంటారని సమాచారం. ఇదిలావుంటే వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ చీఫ్ సెక్రెటరీగా పని చేసిన జవహర్ రెడ్డి.. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణంలో కీలక పాత్ర పోషించారు. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అప్రమత్తం చేశారు. ఈ తరుణంలో జవహర్ రెడ్డికి కీలకమైన టీటీడీ ఈవోగా బాధ్యతలు అప్పగించింది.