అడుసు తొక్కనేల కాళ్లు కడగనేల అని ఒక సామెత ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సరిగ్గా సరిపోయేలా ఉంది. ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఎడాపెడా ఎవరినంటే వారిని పార్టీలో చేర్చుకుంటున్న కమలం, విమర‌్శలు వెల్లువెత్తిన తర్వాత, అబ్బబ్బే అలాంటిదేం లేదు, తూచ్ అని నాలుక కర్చుకుంటోంది.
ఆంధ‌్రప్రదేశ్‌లో బలపడాలని తెగ ట్రై చేస్తోంది భారతీయ జనతా పార్టీ. సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయినా, కనీసం నోటాకు వచ్చిన ఓట్లు రాకపోయినా, కేంద్రంలో అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడంతో, ఆపరేషన్ కమలంకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టీడీపీ ఎంపీలను లాగేసుకుంది. మరింత మంది ఎమ్మెల్యేలు, కీలక నేతలను తమవైపు తిప్పుకుని, ఏకంగా టీడీపీని రీప్లేస్ చేయాలని తపిస్తోంది. బలపడాలన్న ఆ ఆత్రంలో తప్పటడుగులు వేస్తోందని విమర్శలపాలూ అవుతోంది బీజేపీ. తాజాగా ఏపీలో జరిగింది అదే.
బలపడాలన్న ఏకైక లక్ష్యంతో ఆర్థికనేరగాళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తోందని ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంది బీజేపీ. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటూ, ఈడీ, ఐటీ, సీబీఐ దాడులతో ఉక్కిరిబిక్కిరైన సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వారిని పార్టీలోకి తీసుకున్నారని, సొంత పార్టీలోనే కాదు, టీడీపీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఇది సరిపోదన్నట్టుగా, ముందూ వెనకా చూసుకోకుండా మరో వివాదాస్పద వ్యక్తి మెడలో కాషాయ కండువా వేయడం, ఇప్పుడు కమలంలో కలకలం రేపుతోంది.
ఇప్పుడు ఇదే ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి నేతలకు కూడా బీజేపీ కండువా కప్పుతుందా అంటూ సోషల్ మీడియాలో, కమలం పట్ల తిట్ల వర్షం కురుస్తోంది. ఇంతకీ ఫోటోలో కన్నా లక్ష్మీనారాయణ కండువా కప్పుతున్నది ఎవరికో అర్థమైందా కోటి. వైసీపీ నాయకురాలు, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి, కేసులపాలైన వ్యక్తి.
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ టైంలో, కోటి అనే ఈ వ్యక్తి తెరపైకి వచ్చాడు. సరిగ్గా ఎన్నికలకు ముందు లక్ష్మీ పార్వతిపై వివాదాస్పద, నిరాధార ఆరోపణలు చేశారు. దీంతో ఇతనిపై అనేక విమర‌్శలొచ్చాయి. కొంతమంది నేతలే ఇతన్ని ముందుపెట్టి ఆరోపణలు చేయిస్తున్నారని వైసీపీ నాయకులు కూడా అలెగేషన్స్ చేశారు. అలా అత్యంత కాంట్రావర్సియల్ వ్యక్తయిన కోటికి, కండువా కప్పడంపై బీజేపీ మీద నెటిజన్లు సుర్రుమంటున్నారు. కేవలం కేసులు లేకుండా ఉండేందుకే బీజేపీలోకి వచ్చారని, ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిన వ్యక్తా అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పేలుస్తున్నారు. ఆర్థిక నేరగాళ్లయిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీలు అనవసరంగా విదేశాలకు పారిపోయారు అలా కాకుండా బీజేపీ కండువా కప్పుకుంటే బావుండేదని విమర్శలు చేస్తున్నారు.
కోటిని చేర్చుకోవడంతో ఇంటా బయటా బీజేపీ మీద విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఒక్కసారిగా నాలుక కర్చుకుంది పార్టీ. కోటిని బీజేపీలో చేర్చుకుంటే పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించిన నేతలు వెంటనే దీనిపై వివరణ ఇచ్చుకున్నారు. కోటి బీజేపీలో చేరడం అకస్మాత్తుగా జరిగిందని స్థానిక పార్టీ నేతలకు సమాచారం ఇవ్వకుండా అతడు బీజేపీలో చేరారని ఏపీ బీజేపీ వివరించింది. బీజేపీలో కోటికి సభ్యత్వం ఇవ్వలేదని అతడు బీజేపీ సభ్యుడు కాదని చెప్పుకుంది. ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. మొత్తానికి పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఎడాపెడా ఎవరిపై అంటే వారిపై కండువాలు కప్పేస్తున్న కమలం, కాస్త ఆలోచించి వ్యక్తులను చేర్చుకోవాలని నెటిజన్లు సుతిమెత్తగా చురకలంటించారు.