YSR Congress Party: ఆ ముగ్గురు నేతలకు కీలక బాధ్యతలు
YSR Congress Party: అధికారంలోకి వచ్చాక పార్టీ మీద ఫోకస్ తగ్గించిన జగన్ ఇప్పుడు పార్టీ మీద దృష్టి సారించారు.
YSR Congress Party: అధికారంలోకి వచ్చాక పార్టీ మీద ఫోకస్ తగ్గించిన జగన్ ఇప్పుడు పార్టీ మీద దృష్టి సారించారు. జిల్లాల పర్యటనకు వెళ్ళబోతున్న జగన్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముందుగా పార్టీలోని అసంతృప్తుల్ని, గ్రూప్‌లను సరిచేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే పార్టీ ఇన్‌ఛార్జ్ బాధ్యుల్ని మార్చారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక పాలనపై పట్టు సాధించాలని నిర్ణయించుకున్న వైసీపీ అధినేత జగన్ పార్టీలో ముగ్గురు సీనియర్లకు మూడు ప్రాంతాలు అప్పగించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు సజ్జల రామకృష్ణారెడ్డికి, కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్ని వైవీ సుబ్బారెడ్డికి ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. ఇక ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్ని మరో సీనియర్ నేత విజయసాయిరెడ్డికి అప్పగించారు జగన్. ఆ తర్వాత సజ్జల, సుబ్బారెడ్డికి భారం అయిందనే ఉద్దేశంతో వారిద్దరికి రెండేసి జిల్లాలు చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలను వేమిరెడ్డికి, కృష్ణా, గుంటూరు జిల్లాల బాద్యతలు మోపిదేవికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా పార్టీపై పూర్తిగా దృష్టి సారించిన జగన్ జిల్లాలను సమీక్షించి ఇన్‌ఛార్జ్‌ల బాధ్యతల్లో మార్పు చేసినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలను అలాగే ఉంచుతూ తర్వాతి కాలంలో నియమించిన వేమిరెడ్డి, మోపిదేవిలను బాధ్యతలనుంచి తప్పించినట్లు తెలిసింది. వీరిద్దరూ బాద్యతలు నిర్వహిస్తున్న నాలుగు జిల్లాల బాధ్యత కూడా సజ్జలకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మార్పుల నిర్ణయం వెలువడ్డాక మూడు ప్రాంతాల ఇన్‌ఛార్జ్‌లు సమావేశమై పార్టీ నిర్వహణపై చర్చలు నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు ముగ్గురు కీలక నేతలు ముఖ్యాంశాల గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్ళ తర్వాత పార్టీపై ఫోకస్ పెట్టిన సీఎం జగన్ మొత్తం పార్టీ వ్యవహారాలన్నీ ముగ్గురు నేతల చేతుల్లో పెట్టారు.