తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత.. జేసీ బ్రదర్స్ హౌస్ అరెస్ట్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దుర్వినియోగంపై జేసీ సోదరులు సోమవారం తాడిపత్రిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు జేసీ సోదరులను గృహనిర్బంధం చేశారు. జేసీ దివాకర్‌రెడ్డిని జూటూరులోని ఆయన తోటలో, ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రిలోని ఆయన స్వగృహంలో నిర్బంధించారు. పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. తాడిపత్రిలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉందని తెలిపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
తాడిపత్రిలో గత నెల 24న టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య జరిగిన రాళ్ల దాడికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా జేసీ సోదరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి తహసీల్దారు కార్యాలయం వద్ద మౌనదీక్ష చేపట్టేందుకు రెడీయ్యారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై దుర్వినియోగంపై శాంతియుతంగా నిరసన దీక్ష చేపడతామంటే ఈ ఆంక్షలు ఏమిటని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. రాజకీయాలకతీతంగా చేపట్టిన దీక్షకు భారీగా పోలీసులను రప్పించడం ఏంటని ఆయన పోలీసు అధికారులను ప్రశ్నించారు. కరోనా కారణంగా తన ఆరోగ్యం దెబ్బతింటుందన్న ఆందోళనతో సోదరుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనకు మద్దతుగా నిరసన దీక్షలో పాల్గొననున్నారని తెలిపారు.