Jagan with trainee IAS: లోపాలు సరిదిద్దాలి

Jagan with trainee IAS: వ్యవస్థలోని లోపాలు సరిదిద్దేందుకు ఐఏఎస్ లు పనిచేయాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన్ను కలిసిన ట్రైనీ ఐఏఎస్ లతో మాట్లాడారు.

Update: 2020-06-30 03:20 GMT

Jagan with trainee IAS:  వ్యవస్థలోని లోపాలు సరిదిద్దేందుకు ఐఏఎస్ లు పనిచేయాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన్ను కలిసిన ట్రైనీ ఐఏఎస్ లతో మాట్లాడారు. కేటాయించిన శాఖల్లో అవగాహన పెంచుకోవడం ద్వారా అనుభవం సంపాదించాలని ట్రైనీ ఐఏఎస్‌లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ప్రతి వ్యవస్థలో లోపాలు కనిపిస్తుంటాయని, వాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందడుగు వేసి వాటిని దృఢంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంటుందని సీఎం చెప్పారు. ప్రభుత్వంలో అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారని, వారి మార్గ నిర్దేశం తీసుకోవాలని ట్రైనీ ఐఏఎస్‌లకు సూచించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో ట్రైనీ ఐఏఎస్‌ అధికారులు సమావేశమయ్యారు.

ముస్సోరీలో రెండో విడత శిక్షణ కోవిడ్‌ కారణంగా నెల రోజుల పాటు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ట్రైనీ ఐఏఎస్‌లకు శాఖల కేటాయింపు చేశారు. ఆయా శాఖల్లో అంశాలను, విధానాలను తెలుసుకునేందుకు ఈ కాలాన్ని ట్రైనీ ఐఏఎస్‌లు వినియోగించుకుంటున్నారు. ఆ శాఖలపై ప్రజెంటేషన్లు తయారు చేసిన ట్రైనీ ఐఏఎస్‌లు.. ఎంపిక చేసిన వాటిపై సీఎంకు చూపించారు. ప్రజెంటేషన్లు ఇచ్చిన ట్రైనీ ఐఏఎస్‌లు కేటన్‌ గార్గ్, విదేఖరే, ప్రతిస్థలను సీఎం అభినందించారు. వారిని శాలువాలతో సత్కరించారు.

పేదల అభ్యున్నతికి పాటుపడండి

పేదల అభ్యున్నతి కోసం పని చేయాల్సిన గురుతర బాధ్యత ఐఏఎస్‌ అధికారులపై ఉందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. శిక్షణ పొందుతున్న ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారులు గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారితో గవర్నర్‌ మాట్లాడుతూ ఐఏఎస్‌కు ఎంపిక కావడం అంటే ప్రజల సేవకు లభించిన అత్యున్నత అవకాశమని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. సాంఘిక సమానత్వం, మత సామరస్యం, ప్రాంతీయ అభివృద్ధికి పెద్దపీట వేయాలని శిక్షణ ఐఏఎస్‌ అధికారులకు గవర్నర్‌ సూచించారు.  

Tags:    

Similar News