ఏపీలో ఎదిగేందుకు పవన్‌నే ముందుపెట్టాలన్నది షా స్ట్రాటజీనా?

Update: 2019-12-05 05:55 GMT
అమిత్‌ షా, పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, బీజేపీకి దగ్గరవుతున్నారా..? వరుసగా బీజేపీ పరిభాషలోనే మాట్లాడటం అవే సంకేతాలిస్తోందా...? కాషాయ దళాధిపతి అమిత్‌ షాపై పొగడ్తల వర్షం‌ దేనికి నిదర్శనం...? పవన్‌ బీజేపీకి దగ్గరవుతున్నారా లేదంటే బీజేపీనే పవన్‌కు క్లోజవుతోందా...? ఎన్నడూ లేనిది మతాలు, మత మార్పిళ్లు, జగన్‌ కులమేంటి, మతమేంటి అంటూ పవన్ చేస్తున్న కాంట్రావర్సియల్ కామెంట్ల వెనక, అంతుచిక్కని వ్యూహం ఏదైనా వుందా? పవన్‌ మాటలు, ఆయన భవిష్యత్‌ బాటను చెప్పకనే చెబుతున్నాయా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, మాట తీరే మారిపోయింది. జనసేన స్థాపన టైంలో నేను భారతీయున్ని, నాకు కులం లేదు, మతం లేదు, జై హింద్ అంటూ హోరెత్తించిన పవన్, ఇప్పుడు మాత్రం నేను హిందువును, హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే సహించను అంటున్నారు. కనక దుర్గమ్మ కొలువైన బెజవాడలో, మత మార్పిళ్లు జరుగుతున్నాయంటూ ఫైరవుతున్నారు. సీఎం జగన్‌ క్రిస్టియన్, అలాంటప్పుడు రెడ్డి అనే కులమెందుకు అంటూ వ్యక్తిగత విమర్శలతో చెలరేగిపోతున్నారు. మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అన్నారు. మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని, ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరని పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాజాగా మరోసారి దుర్గమ్మ సన్నిధికి కొద్దిదూరంలోనే మత మార్పిళ్లు జరుగుతుంటే, సీఎం జగన్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

వరుసగా మతాల గురించి మాట్లాడుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ భావజాలం, ఈ భాష మొత్తం చూస్తుంటే, ఏమనిపిస్తుంది ఇది భారతీయ జనతా పార్టీ భాష ఆ పార్టీ నేతలు తరచుగా మతం, మత మార్పిళ్ల గురించి గొంతెత్తుతుంటారు. ఇప్పుడు అదే భాష పవన్ కల్యాణ్‌ మాట్లాడుతున్నారు. దీంతో పవన్ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఈ మాటలను మరింత బలపరిచేలా తాజాగా మరో మాట మాట్లాడారు పవన్ కల్యాణ్. బీజేపీకి తాను దూరంగా లేనని కలిసే ఉన్నానని జనసేన అధినేత స్పష్టం చేయడం సంచలనమైంది. అమిత్‌ షా లాంటి వాళ్లు దేశానికి సరైన నాయకులని వ్యాఖ్యానించారు. పవన్‌ తాజా కామెంట్లు సరికొత్త చర్చకు దారి తీశాయి.

బీజేపీకి దూరంగాలేనని క్లియర్‌ కట్‌గా చెప్పేశారు పవన్..

మరి తానే కమలానికి దగ్గర కావాలనుకుంటున్నారా?

లేదంటే బీజేపీనే రారమ్మంటోందా?

పొత్తుతోనే సరిపెడతారా? విలీనానికి సైతం సిద్దపడతారా?

మొన్నటి ఢిల్లీ రహస్య పర్యటన తర్వాతే సమీకరణాలు మారిపోయాయా?

హస్తిన టూర్ తర్వాత పవన్‌ వాయిస్‌లో ఒక్కసారిగా మార్పుకు అదే కారణమా?

కాషాయ నేతలు, పవన్‌ మధ్య జరిగిన సంభాషణేంటి?

కాషాయ నేతగా ఎస్టాబ్లిష్‌ అయ్యేందుకు పవన్‌ గ్రౌండ్‌ ప్రిపేర్ చేసుకుంటున్నారా?

అందుకే మతం, మతమార్పిళ్లు అంటూ కాషాయ భాషను మాట్లాడుతున్నారా?

అసలు బీజేపీ-పవన్‌ మధ్య అసలేం జరుగుతోంది?

పవన్‌ కల్యాణ్‌ క్లియర్‌గా చెప్పేశారు తాను బీజేపీకి దూరంగా లేనని. కాషాయదళానికైతే పవన్ దగ్గరవుతున్నారని, ఆయన మాట్లాడుతున్న భాష, వదులుతున్న ఫీలర్లను బట్టి అర్థమవుతోంది. కానీ తేలాల్సింది ఏంటంటే పవనే బీజేపీకి క్లోజ్‌ అవుతున్నారా లేదంటే బీజేపీనే పవన్‌కు వెల్‌‌కమ్ చెబుతోందా ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినా, ఇప్పుడే పాత స్నేహాలు గుర్తుకు చేసుకోవడానికి కారణమేంటి వీటన్నింటికీ బీజం, పవన్ మొన్నటి ఢిల్లీ టూర్‌లోనే పడిందా బీజేపీ, జనసేన మధ్య అసలేం జరుగుతోంది?

నవంబర్‌ రెండోవారంలో ఢిల్లీలో పర్యటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అంతకు కొన్ని రోజుల ముందే ఇసుక సమస్యపై, వైజాగ్‌లో భారీ ఎత్తున లాంగ్‌ మార్చ్‌ నిర్వహించడం, అదే సభలో కేంద్ర పెద్దలతోనూ తాను ఈ విషయంపై మాట్లాడతానని చెప్పడంతో, సహజంగానే మోడీ, అమిషాలను కలిసి, రాష్ట్ర పరిస్థితులు వివరిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలీదు కానీ, పవన్‌ కల్యాణ్‌ నేరుగా ఎవరినీ కలవలేదన్న ప్రచారం జరిగింది. దాదాపు రెండురోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసిన పవన్‌కు, మోడీ, అమిత్‌ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ నడ్డా సైతం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదట. అయితే, ఇదంతా బయట జరిగిన ప్రచారం. కానీ అమిత్‌ షాతో పాటు కొందరు బీజేపీ సీనియర్ నేతలతో పవన్ సమావేశమయ్యారన్న ప్రచారం జరిగింది. పవన్‌ను బీజేపీ పెద్దలు నేరుగా ఎందుకు కలవలేదన్న దానిపై మరో కథనం కూడా ప్రచారంలో వుంది.

ఇప్పుడే కలిసి మాట్లాడితే, జనసేన, బీజేపీలు ఏకమయ్యాయన్న భావన ప్రజల్లో ఏర్పడుతుందని, అందుకే ఇప్పుడు కలవడం అంత మంచిదికాదని కొందరు బీజేపీ సీనియర్లు పవన్‌కు చెప్పారట. అంతేకాదు, దారుణంగా జనసేన ఓడిపోయిందని, పార్టీ అధ్యక్షుడే రెండు చోట్లా పరాజయం పాలయ్యారని అన్నారట. ఎస్టాబ్లిష్‌ లీడర్‌గా ఎదగాలని సూచించారట. నిత్యం వార్తల్లో వుండాలని, ప్రభుత్వంపై ధాటిగా విమర్శలు చేయాలని, కాంట్రావర్సియల్ కామెంట్లు సంధించాలని పవన్‌కు హితబోధ చేశారన్న ప్రచారం సాగింది. ముఖ్యంగా యూపీ, బీహార్‌‌‌తో పాటు తెలంగాణలోనూ కొంత వర్కౌటైన హిందూత్వ అజెండాతో ప్రసంగాలు చేయాలని చెప్పారట. జగన్‌ క్రిస్టియన్‌ కాబట్టి, ఆ యాంగిల్‌లో వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, జగన్ అండతోనే మతమార్పిళ్లు జరుగుతున్నాయన్న భావన రాష్ట్రంలో తేవాలని సూచించారట. అప్పుడే, మతాలపరంగా ఓటర్లలో చీలిక వచ్చి, మెజారిటీ ప్రజలు అండగా వుంటారన్న కర్తవ్యాన్ని నూరిపోశారన్న మాటలు వినిపించాయి. అందుకే ఢిల్లీ పర్యటన తర్వాత పవన్‌ వాయిస్‌ పూర్తిగా మారిపోయిందని, మతం, మత మార్పిళ్లు వంటి బీజేపీ భాషనే మాట్లాడుతున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, బీజేపీకి తాను దూరంగా లేనని, దగ్గరగానే వున్నారని కూడా అనడంతో, రెండు పార్టీల మధ్య దూరం తగ్గిపోతోందన్న మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

బీజేపీకి పవన్‌ అవసరముందా? పవన్‌కే కాషాయ సపోర్ట్‌‌ అవసరమా?

అటు టీడీపీ, ఇటు జనసేనల ఫ్లైయింగ్ కిస్‌లపై బీజేపీ ఆలోచనేంటి?

మరోసారి 2014 కూటమి ఆవిష్కృతమవడం ఖాయమా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం ఆరు నెలలే అయ్యింది. కానీ ఇంతలోనే ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా విమర్శల దాడి చేస్తున్నాయి. కేడర్ చెల్లాచెదురు కాకుండా, టీడీపీ గత వైభవం కోసం పోరాడుతుంటే జనసేన వెనక ఢిల్లీ పెద్దల వ్యూహం ఉందన్న ప్రచారం చాలా రోజులు నుంచి సాగుతున్నదే. తాజాగా పవన్ కల్యాణ్‌ మాటలే అందుకు నిదర్శమన్న వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌‌లో భారతీయ జనతా పార్టీకి అంత స్కోప్ లేదు. హోదాపై మాట తప్పినందుకు గత ఎన్నికల్లో డిపాజిట్లను సైతం గల్లంతు చేశారు ఏపీ ఓటర్లు. అయినా ఏపీని వదులుకునేందుకు అమిత్‌ షా సిద్దంగా లేరు. అలా అని టీడీపీతో జతకట్టే పరిస్థితి కమలదళానికి లేదు. ఇలాంటి సమయంలో అగ్రనేతల కళ్లు పవన్ కళ్యాణ్‌పై పడినట్లు ఊహాగానాలు వినపడుతున్నాయి. 2023 లేదా 2024 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్‌ని కలుపుకొని ఏపీలో శక్తిమంతమైన పార్టీగా లేదా కూటమిగా మారాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేపీ పవన్ వెంటపడటం పక్కనపెడితే, పవనెందుకు కమలంతో దోస్తికి అంతగా ఆరాటపడుతన్నారన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. పార్టీ పెట్టి సంవత్సరాలు గడుస్తున్నా జనసేనకు సంస్థాగత నిర్మాణం లేదు. పవన్, నాదెండ్ల మనోహర్ తప్ప, మిగతా జనసేన నాయకులు ఎవరంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. తిరుపతిలో జరిగిన పార్టీ సమావేశంలోనూ, ఓ నేత ఇలాగే పవన్‌ను ప్రశ్నించారట. దీంతో పవన్‌ సైతం, పార్టీ నిర్మాణంలో తాను నిస్సహాయతలో వున్నానని, అందరి ముందే చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే, సొంతంగా పార్టీని మరో ఐదేళ్లు నడపడం పవన్‌కు ఆర్ధికంగానూ కష్టమే. అందుకే బీజేపీతో చేతులు కలిపితే, అన్ని విధాలా మేలని భావిస్తున్నారట. ఆ ఆలోచనతోనే బీజేపీకి దగ్గరయ్యేందుకు ఒకవైపు మతం, మత మార్పిళ్లు, మరోవైపు అమిత్‌ షాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నిత్యం వార్తల్లో నిలిచేందుకు కాంట్రావర్సీలు సంధిస్తున్నారట. బీజేపీకి దూరంగాలేనన్న పవన్‌, మరి పార్టీని విలీనం చేస్తారా లేదంటే పొత్తుకు పరిమితం అవుతారా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.

అటు జనసేన అధినేత పవన్‌ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్వాగతించారు. బీజేపీతో కలిసే ఉన్నామని కేంద్రం పెద్దలంటే తమకు గౌరవమని, పవన్‌‌, టీడీపీ నేతలు చెబుతున్నారని అన్నారు. తమ విధానాలు నచ్చి బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటే ప్రాంతీయ పార్టీల విలీనాన్ని స్వాగతిస్తామని జీవీఎల్ ప్రకటించారు. పవన్ విలీన ప్రతిపాదనతో వస్తే ఆహ్వానిస్తామని, అందుకు తన వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు జీవీఎల్. అయితే, పొత్తులకు ఇది సమయం కాదన్నారు. రాజకీయ కారణాలతో తమ భుజాలపై నుంచి ఆరు అడుగుల బుల్లెట్‌ను వేరేవారిపైకి సంధించాలనుకుంటే పొరపాటేనని జీవీఎల్ చెప్పడం మరో ట్విస్టు. మతసామరస్యం లేకపోవడానికి హిందువులే కారణమన్న పవన్‌ వ్యాఖ్యలను జీవీఎల్ ఖండించారు. మత ఘర్షణలకు హిందువులే కారణమనడం రాజకీయ దురుద్దేశమేనని అన్నారు.

ఒకవైపు అమిత్‌ షా అంటే గౌరవమని, బీజేపీతో దగ్గరగానే ఉన్నానని పవన్ చెప్పడం, మరోవైపు రాజకీయ కారణాలతో తమ భుజాలపై నుంచి తుపాకీ పెట్టి, వేరేవారిపైకి సంధించాలనుకుంటే పొరపాటేనని జీవీఎల్ అనడం చర్చనీయాంశమైంది. అంటే అటు టీడీపీ, ఇటు జనసేనలు ఎవరికివారే బీజేపీకి గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్న అర్థంలో జీవీఎల్ మాట్లాడారన్న భావన కలుగుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే, పవనే కమలానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని, హిందూత్వ అజెండా ఉన్న నాయకుడిగా ఎస్టాబ్లిష్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. చూడాలి, టీడీపీ, బీజేపీ, జనసేనలు కలుస్తాయో వైసీపీ నేతలు అంటున్నట్టు బీజేపీలో జనసేన విలీనమవుతుందో ఇప్పుడు హీటెక్కిస్తున్న ఏపీ రాజకీయాలు మున్ముందు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో కాలమే సమాధానం చెప్పాలి. 

Full View

Tags:    

Similar News