Balakrishna Facing Challenges: హిందూపురంలో ఆ రెండు సమస్యలపై బాలయ్య రియాక్షన్ ఎలావుంటుందో?

Update: 2020-06-30 08:21 GMT

హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య రాష్ట్ర ప్రభుత్వంపై పోరుబాటకు సిద్ధమవుతున్నారా..? తన నియోజకవర్గ ప్రజల కోసం ఎందాకైనా వెళ్లేందుకు రెడీగా ఉన్నారా..? ఈ మధ్య నియోజకవర్గంలో బాలకృష్ణను వెంటాడుతున్న ఆ రెండు సమస్యలేంటి..? వాటి కోసం త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎందుకు కలుస్తానంటున్నారు..? అసలు హిందూపురం నియోజకవర్గంలో ఏం జరుగుతోంది...?

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తన సొంత నియోజకవర్గంగా భావించి ఇక్కడి నుంచి పోటీ చేసి, గెలుపొందారు. ఆయన వారసుడిగా హరికృష్ణ అనంతరం బాలకృష్ణ ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో ఎవరు అభ్యర్థిగా ఉన్నా ఓటర్లు మాత్రం టీడీపీకే పట్టం కడుతున్నారు. దీంతో నందమూరి కుటుంబాన్ని దశాబ్ధాలుగా ఆదరిస్తున్న హిందూపురం ప్రజల ఆకాంక్ష మేరకు అభివద్ధి పనులు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు బాలకృష్ణ.

గత టీడీపీ ప్రభుత్వంలో వేల కోట్ల నిధులు తెచ్చి హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ది బాట పట్టించారు బాలకృష్ణ. తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజల దాహర్తి తీర్చేందుకు గొల్లపల్లి నుంచి హిందూపురం వరకూ ప్రత్యేక పైప్ లైన్ తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. పట్టణంలోనూ పలు నిర్మాణాలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో బాలకృష్ణ అంటీముట్టనట్లు ఉంటున్నారు. జిల్లా సమావేశాలకు ఎమ్మెల్యే స్థాయిలో పెద్దగా హాజరు కావడం లేదు. అడపాదడపా నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా తాజాగా తన నియోజకవర్గంలో బాలకృష్ణను రెండు సమస్యలు వెంటాడుతున్నాయి.

గతంలో హిందూపురంలో మంజూరైన మెడికల్ కాలేజీని ఇప్పుడు పెనుకొండ నియోజకవర్గానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై బాలయ్య అలర్ట్ అయ్యారు. తన నియోజకవర్గంలోని మలుగూరు వద్ద స్థలం సిద్ధంగా ఉందని, హిందూపురంలో అన్నివసతులతో కూడిన ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉందని ఇక్కడే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు బాలయ్య. కలెక్టర్ గంధం చంద్రుడుకు ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కళాశాలను తరలించ వద్దని చెప్పారు. పెనుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ మెడికల్ కాలేజీని తరలించుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ ప్రతిపాదనను ఆమోదించవద్దని బాలయ్య అధికారులను కోరారు. ఇదే విషయాన్ని తన నియోజకవర్గంలో ఇతర పార్టీల నేతలతోనూ చర్చించారు. అవసరమైతే ఆందోళన చేయడానికి సిద్ధమని ప్రకటించారు బాలకష్ణ. కరోనా నేపథ్యంలో నియోజకవర్గానికి రావొద్దని చెబుతున్నారని, అయితే త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ ని కలిసి ఈ విషయంపై మాట్లాడుతారని చెబుతున్నారు.

ఇటు కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాగా ప్రకటించాలని అక్కడి నేతలు, స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. దీనికి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి కూడి మద్దతు ఇస్తున్నారు. మంత్రి శంకరనారాయణ ప్రాతినిథ్యం వహిస్తున్నపెనుకొండ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం మధ్యలో ఉందని, అక్కడే జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న హిందూపురాన్నే జిల్లా చేయాలని ఇక్కడి ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇలా అన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఆందోళన చేస్తున్నారు. ఈ రెండు అంశాలు బాలయ్యను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మెడికల్ కాలేజీ, కొత్త జిల్లా ఏర్పాటు రెండు కూడా తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు కావడంతో బాలయ్య మరింత అప్రమత్తమయ్యారు. అధికారులతో ఫోన్ లో మాట్లాడడంతో పాటు నియోజకవర్గంలోని అఖిల పక్ష నేతలతోనూ చర్చిస్తున్నారు. కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన నందమూరి నటసింహం తన నియోజకవర్గంలో నెలకొన్న ఈ రెండు సమస్యలను ఎలా పరిష‌్కరిస్తారానేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.


Full View


Tags:    

Similar News