ఆంధ్రప్రదేశ్‌లో రివర్స్ టెండరింగ్ కొత్త ట్రెండ్ సృష్టిస్తే, ఇప్పుడు అదే తరహాలోనే రాజకీయంలోనూ రివర్స్ స్క్రీన్ ప్లే మొదలైందా? పార్టీని వీడాలనుకుంటున్నవారికి తటస్థ దారి రక్షణ కల్పిస్తోందా? వల్లభనేని వంశీ చూపిన, ప్రత్యేక దారి కొత్త ట్రెండ్‌కు ద్వారాలు తెరిచిందా? కర్ర విరగకుండా పాము చావకుండా, సేఫ్ గేమ్‌ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మొదలుపెట్టిందా వంశీ దారిలో ఇంకా ఐదారుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ దిగడం ఖాయంగా కనిపిస్తోందా? అదే జరిగితే చంద్రబాబు ప్రతిపక్ష హోదా ప్రమాదంలో పడినట్టేనా? అసలు ఏపీ రాజకీయాల్లో రివర్స్ స్క్రీన్ ప్లే ఏంటి?
ఆంధ‌్రప్రదేశ్ పాలిటిక్స్‌లో రివర్స్ స్క్రీన్ ప్లే మొదలైందా?
జంపింగ్ నేతలకు వంశీ "ప్రత్యేక" దారి చూపారా?
తటస్థ వ్యూహంతో టీడీపీని దెబ్బకొట్టాలన్నది వైసీపీ వ్యూహమా?
వంశీని స్పెషల్ మెంబర్‌గా ప్రకటించడంతో ఇక టీడీపీ నుంచి భారీ వలసలు తప్పవా?
ఐదారుగురు ఎమ్మెల్యేలు సైకిల్ దిగబోతున్నారా?
చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా ఇక ప్రమాదంలో పడినట్టేనా?
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ స్ట్రాటజీకి టీడీపీ దగ్గర కౌంటర్ స్ట్రాటజీ వుందా?
ఆంధ్రప్రదేశ్‌లో వలసల రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. చంద్రబాబు తన హయాంలో నేరుగా వైసీపీ ఎమ్మెల్యేలకు కండువా కప్పి గ్రాండ్‌గా వెల్కమ్ చెబితే, ఆ ట్రెండ్‌కు డిఫరెంట్‌గా రివర్స్ ట్రెండ్‌కు తెరలేచింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.
పార్టీ ఫిరాయింపులకు తాము పూర్తి వ్యతిరేకమని సీఎం జగన్ స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. తాము గేట్లు తెరిస్తే, టీడీపీ ఖాళీ అవుతుందని, చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు అవుతుందని అన్నారు. అయితే, విలువలున్న పార్టీగా తాము వలసలను ఏమాత్రం ప్రోత్సహించమని ప్రకటించారు. ఎవరైనా వైసీపీలోకి రావాలంటే, రాజీనామా చేసిన తర్వాతే రావాలని షరతు విధించారు. దీంతో తెలుగుదేశం ఊపిరిపీల్చుకుంది. అధికార పార్టీలోకి జంప్ కావాలనుకున్న చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం తీవ్ర నిరాశ చెందారు. కానీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అలాంటి వారికి కొత్తదారి చూపారు.
ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ శీతకాల సమావేశాలకు హాజరైన గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీ, తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి వేరే చోట సీటు కేటాయించాలంటూ స్పీకర్ తమ్మినేని సీతారాంకు విజ్ఞప్తి చేశారు. వంశీ విజ్తప్తికి స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఓకే అన్నారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం మీకు ఏదో ఒక చోట సీటు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే వంశీని స్పీకర్ ప్రత్యేక సభ్యుడిగా గుర్తించడం వెనక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు పక్కా వ్యూహముందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అంటే టీడీపీ నుంచి బయటకు వచ్చే ఎమ్మెల్యేలను తటస్థులుగా గుర్తిస్తామన్న సంకేతాన్ని పంపినట్టయ్యిందన్న వాదన వినిపిస్తోంది.
అయితే తటస్థ వ్యూహం పార్టీ మారిన, మారాలనుకుంటున్న ఎమ్మెల్యేలకు సులువైన మార్గం కనిపించినట్టయ్యింది. గెలిచిన పార్టీకి వీడినా అనర్హత వేటు పడనప్పుడు తటస్థులుగా కొనసాగుతూ అధికార పార్టీతో లోపాయికారిగా కలిసి వుండటం బెటరని, జంప్ కావాలనుకుంటున్న ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అంటే పార్టీ మారినా, అనర్హత వేటు పడే ఛాన్సే లేదు. మరో పార్టీ మారామన్న అపవాదు కూడా జనంలో రాదు. పార్టీ ఫిరాయించారని టీడీపీ కూడా గట్టిగా వాదించడానికి ఛాన్సూ వుండదు. సాంకేతికంగా పార్టీ మారలేదు కాబట్టి, కోర్టులోనూ ఈ గ్రౌండ్స్‌లో పెద్దగా ఇబ్బంది వుండదని, పార్టీ మారాలనుకున్న సభ్యులు లాజికల్ థింక్ చేస్తున్నారు.
ఇందులో వైసీపీకి మరో స్ట్రాటజీ కూడా వుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశాన్ని మరింతగా దెబ్బకొట్టే వ్యూహముంది. ఇప్పటికే టిడిపిలో వంశీని మినహాయిస్తే, 22 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. వీరిలో ఆరు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా తమను ప్రత్యేక సభ్యులుగా లేదంటే ప్రత్యేక టీంగా గుర్తించాలని కోరితే, చంద్రబాబుకున్న ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా గల్లంతు అవుతుంది. ఆయనకు లభించే ప్రత్యేక సదుపాయాలు కూడా దూరమవుతాయి.
ఇక ఒకవేళ వంశీ రూపంలో కనిపించిన తటస్థ దారి సక్సెస్ అయితే, మరింత మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు అదే బాటలో నడిచేందుకు సిద్దంగా వున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దాదాపు ఐదుగురు ఎమ్మెల్యేలు వంశీ రూట్‌లో నడిచేందుకు రెడీగా వున్నారని తెలుస్తోంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఇమ్మీడియట్‌గా టీడీపీని వీడేందుకు సిద్దంగా వున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని ప్రసాద్‌లు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పే అవకాశముందని తెలుస్తోంది. ఇలా పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేలందరూ తమను ప్రత్యేక గ్రూపుగా ప్రకటించాలని స్పీకర్‌ను కోరే అవకాశముంది.
మొత్తానికి పాము చావకుండా, కర్ర విరగకుండా అన్న సేఫ్ గేమ్‌తో తెలుగుదేశాన్ని చావు దెబ్బ తీసేందుకు వ్యూహం వేస్తోంది వైసీపీ. సాంకేతికంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ దిగేందుకు సిద్దంగా వున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంతకుముందే అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మూడో ప్లేస్‌లో వుంటుందని, వైసీపీ, బీజేపీ మధ్యే పోటీ వుంటుందన్నారు. మొత్తానికి వైసీపీ పకడ్బందీ స్ట్రాటజీ వేసిందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. చూడాలి వైసీపీ వ్యూహానికి టీడీపీ ఎలాంటి కౌంటర్ స్ట్రాటజీ వేస్తుందో రానున్న రోజుల్లో ఏపీలో ఎలాంటి రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకుంటాయో.