ఆంధ్రప్రదేశ్‌లో కూడా టీడీపీకి ఇక గడ్డుపరిస్థితేనా?

Update: 2019-07-04 12:59 GMT

తెలంగాణలో కనుమరుగైన తెలుగుదేశం పార్టీ... ఆంధ్రాలోనూ తెరమరుగు కానుందా?. తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు శకం ఇక ముగిసినట్లేనా? టీడీపీ లక్ష్యంగా వైసీపీ, బీజేపీ మొదలుపెట్టిన ఆటేంటి? అసలు బాబు టార్గెట్‌గా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?

చంద్రబాబుకి ముందు.... చంద్రబాబుకి తర్వాత. ఏపీ రాజకీయాల్లో బాబు శకం ముగిసినట్లేనా? కుప్పం టూర్‌లో బాబు వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఆంధ్రప్రదేశ్‌లో కూడా టీడీపీకి ఇక గడ్డుపరిస్థితేనా?

ఇప్పటికే తెలంగాణలో కనుమరుగైన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ తెరమరుగు చేసేందుకు బలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే మాట వినిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు శకానికి ముగింపు పలకాలన్న లక్ష్యంతో అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూలేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కోంటోంది. 37ఏళ్ల టీడీపీ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా ఇప్పుడున్నంత ఇబ్బందికర సిట్యువేషన్‌ ఎన్నడూ తలెత్తలేదు. చంద్రబాబు వరుసగా పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నా మళ్లీ పుంజుకుని తిరుగులేని విజయంతో అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నడూలేనంతగా పార్టీ ఘోర పరాజయం పాలవడంతో నేతలు, కేడర్‌లో ఆత్మస్థైర్యం తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు వేస్తున్న పాచికలు పారడం లేదనే మాట వినిపిస్తోంది. రాజకీయ వైకుంఠ పాళి ఆటలో చంద్రబాబును మించిన ఎత్తులతో టీడీపీని పూర్తిగా నిర్వీర్యంచేసే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజకీయ చదరంగంలో సైలెంట్‌గా కొత్త ఆట మొదలుపెట్టిన వైసీపీ, బీజేపీ అసలు తెలుగుదేశమే లేకుండా చేసేందుకు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.

సైన్యాన్ని వదిలిపెట్టి ఏకంగా రాజుకే చెక్‌ పెట్టేందుకు ప్రత్యర్ధులు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా పావులు కదిపారు. రాజధాని అమరావతి నుంచి బాబు సొంత నియోజకవర్గం కుప్పం వరకు దీన్ని అమలు చేసినట్లు తెలుస్తోంది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన ఆట కుప్పం పర్యటనలో చంద్రబాబు స్వాగత ఫ్లెక్సీలు, టీడీపీ బ్యానర్ల ధ్వంసం వరకు సాగిందనే ప్రచారం జరుగుతోంది. అయితే తన సొంత నియోజకవర్గంలోనే తనకు చెక్ పెట్టాలనే ప్రయత్నం జరుగుతోందని గమనించిన చంద్రబాబు టీడీపీ ఫ్లెక్సీల ధ్వంసాన్ని పదేపదే ప్రస్తారించారని తెలుస్తోంది.

కుప్పంలో చంద్రబాబు జెండా పీకే పని మొదలుపెట్టింది అధికార వైసీపీ. ఈ ఎన్నికల్లో బాబు మెజారిటీని భారీగా తగ్గించడంలో సక్సెసైన వైసీపీ. 2024 కోసం ఇప్పట్నుంచే పకడ్బందీగా వ్యూహాన్ని అమలు చేస్తోంది. అందుకే చంద్రబాబు అటెన్షన్ అయినప్పుడల్లా సొంత నియోజకవర్గంలో టెన్షన్‌ పెడుతోంది. ఇంతకీ కుప్పం టార్గెట్‌ గా వైసీపీ మొదలుపెట్టిన పొలిటికల్ గేమ్ ఏంటి?

ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట కుప్పం. అయితే చంద్రబాబు కాలుమోపాక తెలుగుదేశానికి తిరుగులేని కోటగా మారిపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు దశాబ్దాలపాటు కుప్పంలో చంద్రబాబు చెప్పిందే వేదంగా సాగింది. 1989 నుంచి అప్రతిహతంగా కుప్పంలో బాబు రాజకీయ ప్రయాణం సాగింది. అయితే మొట్టమొదటిసారి చంద్రబాబుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడూ సొంత నియోజకవర్గంలో ప్రచారం చేయని చంద్రబాబుకి ఈసాకి కుప్పం ఓటర్లు షాకిచ్చారు. తాను వెళ్లినా వెళ్లపోయినా తనపై నమ్మకంతో ఆఖండ మెజారిటీతో భారీ విజయం కట్టబెడతారన్న విశ్వాసంతో ఉన్న బాబుకి చావుతప్పి కన్నులొట్టపోయినట్లయ్యింది. మొన్నటి ఎన్నికల్లో మొదటి రెండు రౌండ్లు చంద్రబాబు వెనకబడటం ఆయన రాజకీయ జీవితంలో ఓ కుదుపుపడ్డట్టయ్యింది. మెజారిటీ ఊహించని స్థాయిలో పడిపోవడంతో చంద్రబాబు షాక్‌‌కి గురయ్యారు. ప్రత్యర్ధి ఆస్పత్రి నుంచి కాలు కదపలేని స్థితిలో ఉన్నా ముచ్చెమటలు పట్టించడంతో అంతర్మథనం మొదలైంది. ఇదంతా ప్రత్యర్ధుల వ్యూహంలో భాగమని, జనంలో తనపై ఉన్న నమ్మకాన్ని పడగొట్టే ప్రయత్నం జరుగుతోందని, అది కూడా సొంత నియోజకవర్గం నుంచే అమలు చేస్తున్నారని గుర్తించి బాబు అలర్టైనట్లు తెలుస్తోంది.

చంద్రబాబు గతంలో రెండుసార్లు ప్రతిపక్షంలో ఉన్నా కుప్పంలో రాజకీయంగా ఇబ్బందులు ఎదురవలేదు. కానీ మొన్న జరిగిన ఎన్నికల నుంచి బాబు టార్గెట్‌గా కుప్పంలో బలమైన ప్రయోగం జరుగుతోందని అంటున్నారు. చంద్రబాబు సామాజికవర్గం ఓట్లు లేనిచోట కూడా ఆయన ఆధిపత్యం ఏంటనే కోణంలో ప్రత్యర్ధులు ప్రజల్లోకి వెళ్తున్నారు. చంద్రబాబు ఆధిపత్యానికి గండికొట్టేలా నియోజకవర్గంలో అధికంగా ఉన్న వన్నెకుల రెడ్డి సామాజికవర్గాన్ని వైసీపీ ఎగదోస్తోందని అంటున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు అయితే మాకేంటనే బ్యాచ్‌ కుప్పంలో రెడీ అయ్యిందంటున్నారు. ఈ బ్యాచ్‌కు ప్రభుత్వ ప్రోత్సాహంతోపాటు పోలీసుల ఔదార్యం కూడా లభిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ బ్యాచే చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ కటౌట్లు, ఫ్లెక్సీలను కూల్చారని ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబు కుప్పం పర్యటనలో బ్యానర్ల చించివేత చిన్న సంఘటనే అయినా, ఈ విషయాన్ని బాబు పదేపదే ప్రస్తావించారంటే, ఈ ఘటనలో సీరియస్‌నెస్‌ ఇట్టే అర్ధమవుతుంది. తన కంచుకోటకి ప్రమాదం పొంచి ఉందనే సంకేతాన్ని పసిగట్టే చంద్రబాబు ఆలా కేకలు పెడుతున్నారనే మాట వినిపిస్తోంది.

మొత్తానికి ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన రాజకీయ ఆట చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ బ్యానర్లు చించేవరకు వెళ్లింది. అయితే అసలే అధికారం పోయింది. పైగా టీడీపీ చరిత్రలో ఎన్నడూలేనివిధంగా ఘోర పరాజయం ఎదురైంది. మరోవైపు లీడర్లు, కేడర్ తీవ్ర నైరాశ్యంలో ఉంది. ఇంకోవైపు ముఖ్యనేతలు గోడ దూకే పనిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు తన సొంత నియోజకవర్గంపై దృష్టిసారిస్తారా? లేక రాష్ట్రమంతా పర్యటించి కేడర్‌లో భరోసా నింపుతారా? ఏం జరగనుందో కాలమే చెబుతుంది.

Full View

Tags:    

Similar News