Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు చూసేందుకు భారీగా సందర్శకులు

Srisailam: సందర్శకుల రాకతో శ్రీశైలం ఘాట్ రోడ్డు రద్దీ

Update: 2024-08-04 11:36 GMT

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు చూసేందుకు భారీగా సందర్శకులు

Srisailam: ప్రకృతి అందాలు వర్ణించాలంటే అంత సులువేం కాదు. వాటిని చూసి అనుభవం పొందాల్సిందే అంటారు ప్రకృతి ప్రేమికులు. మనసును కట్టి పడేసి, మనో ఉల్లాసం కలిగించే ప్రకృతి దృశ్యాలు చూస్తే అన్ని మరిచి పోతాం. ఇదే ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ట్రాఫిక్ సమస్య తెచ్చి పెడుతోంది. కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు వచ్చే సందర్శకులు తమ వాహనాలు ఎక్కడ పడితే అక్కడే నిలుపుతూ మల్లన్న భక్తులకు నరకం చూపుతున్నారు.

ఆ దృశ్యం అత్యంత అద్భుతం. ఆ అనుభవం ఓ పూర్వం. ప్రకృతి సోయగాలు ఓ వైపు, నురగులతో పరుగులు పెడుతున్న కృష్ణమ్మ మరో వైపు... ఈ అనిర్వచనీయమైన ఘట్టం కళ్లారా చూసేందుకు సందర్శకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఎటు చూసినా జనాలే... కేరింతలే... ఇంత వరకు బాగానే వుంది. కృష్ణమ్మ పరవళ్లు చూసే తొందరలో వాహనాలు ఎక్కడ పడితే అక్కడే ఆపేస్తున్నారు సందర్శకులు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. ట్రాఫిక్ రద్దీ నియంత్రణ పోలీసులకు సవాల్‌గా మారింది. కిలోమీటర్ల మేర నిలిచి పోయిన వాహనాలను తరలించటానికి పోలీసులు నానా తంటాలు పడవలిసి వస్తోంది. నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితి ఇది.

అసలే వారాంతపు సెలవులు. ఇంకేముంది... చిన్నారులతో కలిసి పెద్దలు శ్రీశైలంకి పరుగులు తీశారు. శనివారం, ఆదివారం రద్దీతో జాతరగా మారింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం, వరద పెరగటంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. శ్రీశైలం జలాశయం నీటి మట్టాలు గరిష్ఠ స్థాయికి చేరటంతో డ్యాంకి చెందిన 10 గేట్లు, 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ ఒక్కసారిగా నూరుగులు కక్కుతూ దిగువకు దూకుతోంది. ఈ అపురూపమైన దృశ్యం చూపరులను కట్టి పడేస్తోంది. కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు వాహనాల్లో వస్తున్న సందర్శకులు వాటిని రోడ్డుకు ఇరువైపులా నిలిపివేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బంది మొదలయ్యాయి. శ్రీశైలం, సున్నిపెంట మార్గంలో ప్రయాణం కష్టంగా మారింది. సందర్శకుల వాహనాలతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచి పోతోంది.

శ్రీశైలం తరలి వస్తున్న భక్తులు స్వామి, అమ్మవారి దర్శనం చేసుకోవటం, ప్రాజెక్టు నుంచి కిందకు దూకుతున్న నీటి అందాలు చూడటం పరిపాటి. పార్వదినాలు, పండుగలు, వారాంతపు సెలవుల సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఇప్పుడు అది రెట్టింపు అయింది. దీంతో ట్రాఫిక్ నియంత్రణ సున్నిపెంట పోలీసులకు అగ్నిపరీక్ష అవుతోంది. వాహనాలు రోడ్డుపై నిలుపవద్దని పదే పదే పోలీసులు మైకులతో హెచ్చరించినా... ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది అక్కడ ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.

శ్రీశైలం మొత్తం ఘాట్ రోడ్డు. ఈ రోడ్డుపై వాహనాలు నడపటం కొంత కష్టం. అనుభవం ఉన్న డ్రైవర్లు అయితే కొంత ఇబ్బంది లేకుండా వాహనాలు ముందుకు సాగుతాయి. లేకుంటే సమస్య తప్పదు... శ్రీశైలం డ్యాం అందాలు చూసేందుకు వచ్చే వాహనాలు ఘాట్ రోడ్డు ఎక్కేసరికి కొన్ని రిపేర్‌కి వస్తున్నాయి. దీంతో రోడ్డు మధ్యలో అవి నిలిచిపోతున్నాయి. వాటిని తరలించటానికి మరో వాహనం రావాల్సిందే. ఇది ట్రాఫిక్ సమస్యలను మరింతగా పెంచుతోంది. ఫలితంగా శ్రీశైలం వచ్చే భక్తులు ఘాట్ రోడ్డుపై గంటల తరబడి నిరీక్షణ చేయవలసి వస్తుంది. కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు వచ్చే వారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ వాటిని పట్టించుకునే వాహనదారులు లేకుండా పోతున్నారు. దీంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు అవస్థలు పడుతున్నారు.

Tags:    

Similar News