ఒక పావురం రూ.10 కోట్లు, మరొకటి రూ.14 కోట్లు.. రేస్ పావురాల గురించి ఎప్పుడైనా విన్నారా..?
Racing Pigeons: అవి ఎక్కడికి వెళ్లినా తిరిగివస్తాయి. రాష్ట్రాలను దాటి వదిలి వచ్చినా ఇంటికి చేరుతాయి.
Racing Pigeons: అవి ఎక్కడికి వెళ్లినా తిరిగివస్తాయి. రాష్ట్రాలను దాటి వదిలి వచ్చినా ఇంటికి చేరుతాయి. ఆకాశం ఏనాటిదో వాటి అనురాగం కూడా ఆనాటిదే అని మురిసిపోతారు ఆకుటుంబసభ్యలు. గగనపు వీధులలో తిరుగాడుతూ, ఊసులు, ఊహలు మోసుకొస్తూ.., విశాఖ వీధుల్లో నడియాడుతున్న ఈ ప్రేమ జీవులపై హెచ్‌ఎంటీవీ స్పెషల్ స్టోరీ.
మనం ఇప్పుడు చూస్తున్న పావురాలను హోమింగ్ రేస్ పావురాలంటారు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా ఊహించని ధర ఉంది. అవును అతి తక్కువ సమయంలో గమ్య స్థానానికి చేరే ఈ పావురాలను కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారు. బెల్జియంలో ఒక పావురం 14 కోట్లు పలికింది. ఇంకో పావురాన్ని చైనాకు చెందిన ఒకరు 10 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఇక ఇటువంటి పావురాలతో బుక్కాసింగ్‌కు విడదీయ రాని బంధం ఉంది.
హైదరాబాద్‌కు చెందిన బుక్కాసింగ్ పావురాలకు శిక్షణ ఇచ్చేవాడు. అంతేకాదు బుక్కాసింగ్ చెప్పినట్లే పావురాలు కూడా నడుచుకునేయి. 40 ఏళ్ల క్రితం విశాఖకు వలస వచ్చిన బుక్కాసింగ్ కుటుంబం ప్రస్తుతం సేవానగర్‌లో జీవనం సాగిస్తోంది. ఇక బుక్కాసింగ్ మరణం తర్వాత ఆబాధ్యతను అతని కుమారుడు శ్యామ్‌సింగ్ అతని కుమారులు హర్‌దీప్ సింగ్, రాజ్‌దీప్ సింగ్ కూడా తీసుకున్నారు.
శ్యామ్‌సింగ్ శిక్షణ ఇచ్చిన పావురాలు రాష్ట్రంలో ఎక్కడ విడిచిపెట్టినా విశాఖకు వస్తాయి. కాగా ఆర్థిక ఇబ్బందులతో రెండు జతల పావురాలను శ్యామ్‌సింగ్ అమ్మగా, రెండు నెలల తర్వాత అవి తిరిగి వచ్చాయి. దీంతో ఇంకెప్పుడూ వీటిని అమ్మకూడదనుకున్నాడు శ్యామ్‌సింగ్. మొదట 9 కిలోమీటర్లు, తర్వాత 50, ఆతర్వాత వంద కిలోమీటర్లు ఎగిరేలా అలా వేయి 500కిలోమీటర్లు ఎగిరి గమ్యస్థానానికి వచ్చేలా ట్రైనింగ్ ఇస్తారు.
షార్ట్, మిడిల్, లాంగ్ అని వర్గీకరించిన ఈ పావురాలకు ధాన్యాలు, పప్పులను ఆహారంగా అందిస్తారు. ఇక పావురాలు తిన్న తర్వాత కొండలు, కోనలు తిరిగి మధ్యాహ్నం కల్లా తిరిగి ఇళ్లకు చేరుకుంటాయి. నీళ్లు తాగి విశ్రాంతి తీసుకుంటాయి. మొత్తానికి పావురాలు చేసే విన్యాసాలు చూస్తుంటే ఆనందంగా ఉందని, వాటికి శిక్షణ ఇచ్చేందుకు ఎక్కవగా ఇష్టపడుతున్నట్లు చెబుతున్నారు శ్యామ్‌సింగ్ కుటుంబసభ్యులు.