Modi 3.0 Cabinet: మోదీ కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ నుండి మంత్రి పదవులు వీరికే?

Modi 3.0 Cabinet: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్ డీ ఏ లో కీలకంగా మారారు.

Update: 2024-06-08 09:48 GMT

Modi 3.0 Cabinet: మోదీ కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ నుండి మంత్రి పదవులు వీరికే?

Modi 3.0 Cabinet: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్ డీ ఏ లో కీలకంగా మారారు. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి నాలుగు పదవులు దక్కనున్నాయని ఆ పార్టీ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి. కేంద్ర కేబినెట్ లో కీలకమైన ఫోర్టు పోలియోల కోసం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెస్తారని తెలుగు తమ్ముళ్లు ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర కేబినెట్ లో టీడీపీ నుండి చోటు దక్కేది వీరికే?

కేంద్రమంత్రివర్గం కూర్పు విషయమై బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాతో చంద్రబాబు ఈ నెల 7న న్యూఢిల్లీలో చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశాన్ని పార్టీ ఎంపీలకు వివరించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాల మేరకే కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులను తీసుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. కేంద్ర మంత్రివర్గంలో నలుగురు టీడీపీ ఎంపీలకు చోటు దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఇందులో ఒకరు లేదా ఇద్దరికి స్వతంత్ర హోదా ఉన్న కేబినెట్ మంత్రులుగా అవకాశం రానుంది. మిగిలినవారికి సహాయ మంత్రులుగా కేబినెట్ లో చోటు లభించనుంది.

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, చిత్తూరు ఎంపీ డి.ప్రసాదరావు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లు కేంద్ర కేబినెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఎస్ సీ సామాజిక వర్గం నుండి చిత్తూరు ఎంపీ స్థానంలో డి. ప్రసాదరావుకు బదులుగా అమలాపురం నుండి విజయం సాధించిన జి. హరీష్ పేరు విన్పిస్తుంది. రాయలసీమ నుండి కురుబ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథి కూడా కేంద్ర మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఒకవేళ మూడు మంత్రి పదవులు ఇస్తే స్పీకర్ పదవిని చంద్రబాబు కోరనున్నారని టీడీపీకి చెందిన మాజీ ఎంపీ ఒకరు తెలిపారు.

గుంటూరు నుండి తొలిసారి పెమ్మసాని చంద్రశేఖర్ విజయం సాధించారు. గల్లా జయదేవ్ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన తర్వాత గుంటూరు నుండి పెమ్మసాని చంద్రశేఖర్ ను చంద్రబాబు బరిలోకి దింపారు. ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుండి గెలుపొందారు. పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఈసారి ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్ధులకు ఆర్ధికంగా తోడ్పాటును అందించినందున కేంద్ర మంత్రివర్గంలో వీరిద్దరి పేర్లు రేసులో ముందువరుసలో ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరుసగా మూడుసార్లు విజయం సాధించడం, పార్టీకి విధేయుడిగా ఉన్న రామ్మోహన్ నాయుడికి మోడీ కేబినెట్ లో చోటు లభిస్తుందని చంద్రబాబుతో పాటు ఢిల్లీకి వెళ్లిన ఓ టీడీపీ నాయకుడు అభిప్రాయపడ్డారు.

కీలక ఫోర్ట్ ఫోలియోల కోసం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన కూటమి ఉమ్మడిగా మేనిఫెస్టోను విడుదల చేశాయి. టీడీపీ, జనసేన మేనిఫోస్టోల్లోని కీలక అంశాలను ఈ మేనిఫెస్టోలో చేర్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అవసరమైన ఆర్ధిక వనరులు చంద్రబాబుకు అవసరమౌతాయి. ఇందుకు కేంద్రం నుండి నిధులను రాబట్టుకోవడంతో పాటు రాష్ట్రంలో కూడా ఆర్ధిక వనరులను సమీకరించుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, అర్బన్ డెవలప్ మెంట్, ఇరిగేషన్ వంటి శాఖలను చంద్రబాబు కోరే అవకాశం ఉందని టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. రాష్ట్రానికి అవసరమైన నిధులను రాబట్టుకొనేందుకు కేంద్రంలో మంత్రిపదవులను కోరుకుంటున్నట్టుగా తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.


బీజేపీ నుండి రేసులో పురంధేశ్వరి

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మూడు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. రాజమండ్రి ఎంపీ స్థానం నుండి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయం సాధించారు. ఏపీ నుండి బీజేపీ కోటాలో పురంధేశ్వరికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్ లో చోటు కోసం వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమేష్ కూడా లాబీయింగ్ చేస్తున్నారని సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ వ్యూహరచన చేస్తుంది. ఈ క్రమంలోనే పురంధేశ్వరికి మోడీ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ లో ఉన్న సమయంలో పురంధేశ్వరి కేంద్రమంత్రిగా పనిచేశారు.


జనసేన నుండి బాలశౌరికి అవకాశం

ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన రెండు స్థానాల్లో జనసేన అభ్యర్ధులు విజయం సాధించారు. మచిలీపట్టణం నుండి వల్లభనేని బాలశౌరి జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల ముందు వైఎస్ఆర్ సీపీని నుండి జనసేనలో బాలశౌరి చేరారు. బాలశౌరికి జనసేన కోటా నుండి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బాలశౌరి ఎంపీగా పనిచేశారు. 2019, 2024 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి ఆయన గెలుపొందారు. 2019లో వైఎస్ఆర్సీపీ నుండి, ప్రస్తుత ఎన్నికల్లో జనసేన నుండి బాలశౌరి గెలిచారు.


 తెలంగాణ నుండి రేసులో కిషన్ రెడ్డి, ఈటల...

జి.కిషన్ రెడ్డి గత టర్మ్ లో మోడీ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీ ఎనిమిది స్థానాల్లో గెలుపొందింది. తెలంగాణ నుండి కిషన్ రెడ్డి, డికె అరుణ, ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ పేర్లు కేబినెట్ రేసులో విన్పిస్తున్నాయి. మహిళ కోటాలో డికె అరుణకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ లు కూడా కేబినెట్ రేసులో ఉన్నారు. ఈ ముగ్గురు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని కేంద్ర మంత్రివర్గంలోకి తెలంగాణ నుండి చోటు ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి గతంలో కిషన్ రెడ్డి ఒక్కరికి మాత్రమే కేంద్ర కేబినెట్ లో చోటు లభించింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ నుండి కూడ కేంద్ర మంత్రివర్గంలోకి చోటు దక్కనుంది.

Full View


Tags:    

Similar News