AP Cyclone Warning: వామ్మో తుపాను.. ఏపీలో వణుకు

Update: 2024-10-14 12:40 GMT

Serial Cyclones in AP: భారీ వర్షాలు, తుపానులు.. వాటి వల్ల సంభవించే వరదలు ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతున్నాయి. భారీ వర్షాల ధాటికి బుడమేరు వాగు పొంగి పొర్లి విజయవాడ నగరంలో సృష్టించిన ఉపద్రవం కళ్లముందు కదలాడుతుండగానే మరో తుపాను విరుచుకుపడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తుపానుగా బలపడే అవకాశమున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. దీంతో ప్రజలకు తుపాను అంటేనే గుండెల్లో గుబులు పుడుతోంది. ప్రభుత్వంలోనూ కలవరం మొదలవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నెల్లూరులో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మరో నాలుగురోజుల పాటు తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఏపీలో తీరం దాటిన ఆరు తుపాన్లు

గడచిన పదేళ్ళుగా అక్టోబరు - డిసెంబరు మధ్య దక్షిణ భారతదేశంలో మొత్తం 11 తుపాన్లు తీవ్ర నష్టాన్ని మిగల్చగా వాటిలో ఆరు తుపాన్లు ఏపీలోనే తీరం దాటాయి. ఇవి కాకుండా చెన్నైలో తీరం దాటిన మరో తుపాను ఏపీలో ప్రకృతి బీభత్సానికి కారణమై తీవ్ర నష్టం కలిగించాయి. 2023 డిసెంబరులో వచ్చిన మిచౌంగ్ తుపాను బాపట్ల వద్ద తీరం దాటింది. దీని వల్ల చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. 2022 డిసెంబరులో మాండౌస్ తుపాను మహా బలిపురం సమీపంలో తీరం దాటగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో అపార పంట నష్టం సంభవించింది. 2021 డిసెంబరులో వచ్చిన గులాబ్ తుపాను కళింగపట్నంలో తీరం దాటగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జల్లాలను అతలాకుతలం చేసింది. 2018 డిసెంబరు కాకినాడ సమీపంలో తీరం దాటిన పెతాయ్ తుపాను కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు తీవ్ర నష్టం మిగిల్చింది. 2018 అక్టోబరులో వచ్చిన తిత్లీ తుపాను పలాస సమీపంలో తీరం దాటగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను వణికించింది. 2014 అక్టోబరు వచ్చిన హుద్ హుద్ తుపాను విశాఖపట్నంలో తీరం దాటగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను తీవ్రంగా నష్టపరిచింది. 2016 డిసెంబరులో వచ్చిన వార్దా తుపాను చెన్నై సమీపంలో తీరం దాటగా నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలను నిలువునా ముంచింది.

భారీ నష్టం మిగిల్చిన తుపానులివే..

సంవత్సరం తుపాను పేరు

2014 హుద్ హుద్

2016 వార్దా

2018 తిత్లీ

2018 పెతాయ్

2021 గులాబ్

2022 మాండౌస్

2023 మిచౌంగ్

ఆ మూడు నెలల్లోనే ఎందుకు

అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లోనే ఏపీపై తుపాన్లు విరుచుకుపడుతున్నాయి. ప్రతి ఏడాది నైరుతీ రుతు పవనాలు అక్టోబరులో తిరోగమనమై ఈశాన్య రుతు పవనాలతో శీతాకాలం ప్రారంభమవుతుంది. ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించే సమయంలో సముద్ర ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండటంతో బంగాళాఖాతంలో అదే సమయంలో అల్పపీడనాలు ఏర్పడటానికి కారణమవుతున్నాయి. అల్ప పీడనాలు క్రమేపీ వాయుగుండాలుగా మారటంతో భారీ వర్షాలతో మొదలై తుపాన్లుగా రూపాంతరం చెందుతున్నాయి. గత నెల సెప్టెంబరులో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో పాటు అరేబియా సముద్రంపై తుపాను ప్రభావంతో రుతు పవన ద్రోణి ఏర్పడటంతో విజయవాడ నగరంలో వరద పోటెత్తింది. ఇపుడు మొదలైన తుపాను కూడా దక్షిణ కోస్తాలో బాపట్ల నుంచి నెల్లూరు దాకా బీభత్సం సృష్టించే అవకాశం ఉందనీ, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Tags:    

Similar News