చంద్రబాబునాయుడు తెలంగాణపై ‘కన్నే’శారా?

Chandrababu Naidu: ఏపీ, తెలంగాణలు నాకు రెండు కళ్ళు లాంటివి.

Update: 2024-07-09 10:43 GMT

చంద్రబాబునాయుడు తెలంగాణపై ‘కన్నే’శారా?

Chandrababu Naidu: ఏపీ, తెలంగాణలు నాకు రెండు కళ్ళు లాంటివి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ మాటలు యథాలాపంగా అన్నారో, వ్యూహాత్మకంగా అన్నారో తెలియదు. కానీ, ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో అనేక ఊహాగానాలకు, అనుమానాలకు తావిస్తున్నాయి.


‘‘కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి. తెలంగాణను కబ్జా చేసేందుకు రంగం సిద్ధమైందంటూ’’ చంద్రబాబు మాటలను తప్పుపడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపుతున్నాయి. ‘బీజేపీ తెరవెనుక రాజకీయం ప్రారంభించింది. చంద్రబాబును పావుగా వాడుకుంటోంది. ఏపీ తరహాలోనే తెలంగాణలో నాలుగు స్తంభాలాట ఆడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.. విభజన సమస్యల పేరుతో చంద్రబాబు తెలంగాణకు ఎంట్రీ ఇస్తున్నారు..కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి’ అంటూ జగ్గా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇచ్చిన పిలుపు బాబు వ్యాఖ్యల ప్రకంపనల స్థాయిని మరింత పెంచింది.

తెలంగాణలోని అధికారపార్టీ కాంగ్రెస్ లోనూ చర్చకు దారి తీసింది. నిజంగానే చంద్రబాబునాయుడు తెలంగాణ క్రియాశీలక రాజకీయాలను రీ ఓపెన్ చేసేందుకు సిద్ధమయ్యారని కొందరు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీలో అనూహ్య విజయం సాధించి అధికారం చేపట్టిన ఊపు మీద ఉన్న బాబు తెలంగాణలో చతికిలబడి ఉన్న తెలుగుదేశం పార్టీకి మళ్ళీ జవసత్వాలు కల్పించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర ప్రయోజనాలపైనే ఫోకస్ పెడతారు. చంద్రబాబు మాత్రం ఇపుడు రెండు రాష్ట్రాలపైనా ఫోకస్ పెట్టారనే భావించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ళు పనిచేసిన చంద్రబాబుకు తెలంగాణ రాజకీయాల గురించి అణువణువు తెలుసు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రాన్ని కూడా తన కన్నులాంటిదే అన్నాడంటే తెలంగాణపై చంద్రబాబుకు ఏ స్థాయిలో ఆసక్తి ఉందో అర్ధం చేసుకోవచ్చు.

రాష్ట్రం విడిపోయి పదేళ్ళు దాటిపోయింది. హైదరాబాద్ తో ఉమ్మడి రాజధాని బంధం కూడా తెగిపోయింది. అయినా ఆంధ్రావాళ్లకు తెలంగాణపై ప్రేమ తగ్గలేదు.. తెలంగాణ అనే కంటే హైదరాబాద్ పై ఉన్న మమకారం పోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లక్షలాది మంది ఆంధ్ర ప్రజలు హైదరాబాద్ లో స్థిరపడిపోయారు. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా పదేళ్ళుగా అక్కడికెళుతున్నారు.


చంద్రబాబు రెండు రాష్ట్రాలకు పెద్దన్న అయ్యారా?

ఇప్పుడు చంద్రబాబునాయుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా రెండు రాష్ట్రాల పెద్దన్నగా వ్యవహరించటం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం.?

ఏపీ, తెలంగాణలు నాకు రెండు కళ్ళు లాంటివన్న చంద్రబాబు వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ అనుమానాలు ఆవహించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడనున్న రాజకీయ పరిణామాలపై అనేక ఊహాగానాలు రేకెత్తాయి. తెలుగుదేశం తెలంగాణ శ్రేణుల్లో మాత్రం ఉత్సాహం ఉరకలెత్తింది.

ఇటీవల చంద్రబాబు అరెస్టయిన సందర్భంలో హైదరాబాద్‌లో ఆయనకు మద్దతుగా నిర్వహించిన సాయంకాల సభ బాహుబలి తరహా సినిమా ఫంక్షన్ ను తలపించింది. హైదరాబాద్ లో చంద్రబాబుకు కొన్ని వర్గాల నుంచి ఎంతటి బలమైన మద్దతుందో, ఆయా వర్గాల ప్రయోజనాల పరిరక్షణ కోసం బాబు ఎంత అవసరమో ఆ సభ చాటి చెప్పింది. నిజానికి చంద్రబాబు కూడా హైదరాబాద్ బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోవటం ద్వారా దేశ విదేశాల్లో విజనరీగా కీర్తి ప్రతిష్టలందుకున్నారు.

హైదరాబాద్ కు ఐటీ తానే పరిచయం చేశాననీ, హైటెక్ సిటీ నిర్మాత తానే అనీ, తాను లేకపోతే హైదరబాద్ ఈ స్థాయిలో అభివృద్ధి చెంది ఉండేది కాదని చంద్రబాబే స్వయంగా అనేకసార్లు చెప్పుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీని దాదాపు క్లోజ్ చేసిన చంద్రబాబు ఇపుడు మళ్ళీ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారనీ, తెలుగుదేశంను తెలంగాణలో బలపర్చటానికి ఇదే తగిన సమయం అని భావిస్తున్నారనీ రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

జగ్గారెడ్డి కామెంట్స్... తెరవెనుక ఏం జరుగుతోంది?

చంద్రబాబు వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలను ఆ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి అప్రమత్తం చేయటాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదనీ, ఏదో నిగూఢమైన సమాచారం ఆయనకు ఉండబట్టే అలా అన్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

అయితే, చంద్రబాబు హైదరాబాద్ ను సడన్ గా వీడి అమరావతికి వెళ్ళిపోవడం, హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా పదేళ్ళు వినియోగించుకునే అవకాశాన్ని వదులుకోవడం వెనుక ఓటుకు నోటు కేసు ఉందని రాజకీయ ప్రత్యర్ధులు ఇప్పటికీ అంటుంటారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, బాబు దూతగా వెళ్ళినట్టు చెబుతున్న అప్పటి టీడీపీ నాయకుడు, ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు.

ఓటుకు నోటు కేసును ఎదుర్కొంటున్న గురు శిష్యులిద్దరూ ఇపుడు అనూహ్యంగా రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులయ్యారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవటం ద్వారా పరోక్షంగా కాంగ్రెస్ కు చంద్రబాబు సహకరించి బీఆర్ ఎస్ దెబ్బతీశారని రాజకీయవర్గాలు బలంగా నమ్ముతున్నాయి.

రాష్ట్రం విడిపోయిన తరువాత రెండుసార్లు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఈర్ ఓటుకు నోటు కేసులో రేవంతర్ రెడ్డిని జైలుకు పంపించి చంద్రబాబును రాజకీయంగా తెలంగాణను వీడిపోయేలా చేశారని కూడా అంటుంటారు. చంద్రబాబుకు ఆ కోపం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను జగజ్జేయమానంగా ఏలిన తనకూ, అందులోనూ హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన తాను తిరిగి మళ్ళీ పడిన చోటే లేవాలని, టీడీపీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ఇదే సరైన సమయమని అనుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.


ఆపరేషన్ బీజేపీ..

కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి చెబుతున్నట్టు చంద్రబాబు రెండు కళ్ల వెనుక నిజంగానే బీజేపీ ఉందా..! తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ మధ్య ఇపుడిదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ బాగా బలహీనంగా ఉంది. ఎమ్మెల్యేలంతా జారిపోతున్నారు. కాంగ్రెస్ ను కూడా దెబ్బకొట్టటం ద్వారా జగ్గారెడ్డి బాషలో చెప్పాలంటే తెలంగాణను రాజకీయంగా కబ్జా చేయవచ్చని బీజేపీ భావిస్తోంది.

దీని కోసం బీజేపీ ఏపీ ఫార్ములాను తెలంగాణ లో ప్రయోగించాలని నిర్ణయానికి వచ్చింది.. తెలుగుదేశంను రాజకీయంగా క్రియాశీలకం చేసిన తరువాత జనసేనను కూడా రంగంలోకి దించి లీడ్ రీల్ పోషించి అధికారం హస్తగతం చేసుకునేందుకు బీజేపీ రోడ్ మ్యాప్ సిద్దం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీని కోసం చంద్రబాబును బీజీపీ పావుగా వాడుకుంటోందని జగ్గారెడ్డి అంటున్నారు.

జగ్గారెడ్డి చెప్పినట్టు బీజేపీకి పావుగా ఉపయోగపడాల్సిన అవసరం చంద్రబాబుకు ఏముంది..? ఇదే ప్రశ్న ఆయన ప్రత్యర్ధులను అడిగితే ఓటుకు నోటు కేసు ఉందని చెబుతున్నారు. అదే కాదు.. చంద్రబాబుపై ఉన్న కుంభకోణాల కేసులన్నిటినీ సీబీఐకి అప్పగించాలని సీనియర్ పాత్రికేయుడు బాలగంగాధర్ తిలక్ ఇప్పటికే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై అనేక ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

బాబు రెండు కళ్ళ సిద్ధాంతంపై అనుమానాలు

ఏది ఏమైనా తన రాజకీయపార్టీని తెలంగాణలో బలపర్చుకునే హక్కు చంద్రబాబుకు ఉంది. అందుకు ఆయనను తప్పు పట్టాల్సిన అవసరమేమీ లేదు. కాకపోతే ఏపీతో పాటు తెలంగాణను కూడా చంద్రబాబు సమానంగా చూడటం మొదలు పెడితె రాష్ట్ర విభజన వల్ల కోల్పోయిన అంశాల గురించి, ప్రత్యేకించి కృష్ణా నీటి పంపకాలపై ఎలాంటి వైఖరి అనుసరిస్తారన్న అనుమానాలు ఏపీ ప్రజల్లో అలుముకున్నాయి.

బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులను కాదని కృష్ణా జలాల్లో తెలంగాణ సగం వాటా కోరుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీని కోసం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు పున:పంపిణీ అధికారాలు అప్పగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ఏపీలో.. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

కృష్ణా జలాల పున:పంపిణీ చేపడితే రాయలసీమ ఎడారిగా మారుతుందనీ, శ్రీశైలం నుంచి చుక్క నీరు కూడా అందదని ఆందోళన వ్యక్తమవుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో సహా రాయలసీమలో పెండింగ్ లో ఉన్న అనేక ప్రాజెక్టుల సాధన కోసం తెలంగాణ అభ్యంతరాలను వ్యతిరేకిస్తూ పోరాడాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది.. మరి, రెండు కళ్ల సిద్దాంతంతో ఆ పనిచేయగలుగుతారా.. ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి చాణక్యం ప్రదర్శించగలుగుతారు అనే విషయంలో ఎవరి వాదన వారికుంది.


వేచి చూస్తున్న బీఆర్ఎస్

తాజా రాజకీయ పరిణామాలను బీఆర్ ఎస్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఆంధ్ర నాయకులు మళ్ళీ తెలంగాణలో పాగా వేశారన్న అనుమానాలు పెరిగితే సెంటిమెంట్ మళ్ళీ రాజుకుంటుంది. ప్రజల నుంచి బీజేపీ సహా ఆ పార్టీలో చేరికయ్యే వారందరూ తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకతలను ఎదుర్కోవటం ఖాయమని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది.

కాంగ్రెస్ పార్టీలోనూ అంతర్గతంగా చర్చ నడుస్తోంది. చంద్రబాబు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ పరిణామాలన్నిటినీ కాంగ్రెస్ హై కమాండ్ కు ఎప్పటికపుడు సమాచారం చేరుతోందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

Tags:    

Similar News