Dogs Park: విశాఖలో కుక్కల పార్కు ఏర్పాటుకు జీవిఎంసీ ప్రతిపాదన
Dogs Park: తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వామపక్షాలు, నగరవాసులు * నగర సమస్యలపై దృష్టిపెట్టాలని సూచన
Dogs Park: కుక్కల పార్క్ నిర్మిస్తామని విశాఖ జీవీఎంసీ ప్రతిపాదన ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. రెండు కోట్ల రూపాయలతో కుక్కల పార్కు నిర్మించేందుకు ఇటీవల జీవీఎంసీ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. అయితే దీనిపై వామపక్ష నేతలు, నగర వాసులు మండిపడుతున్నారు. మనుషులకు పార్కులు, ఓపెన్ జీమ్‌లు, పిల్లలకు ఆట స్థలాలు నిర్మించకుండా ఇటువంటి పార్కులు కట్టడమేంటని వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
నగరంలో ప్రస్తుతం విష జ్వరాలు ప్రబలుతున్నాయని దోమల నియంత్రణకు చర్యలు తీసుకోకుండా కుక్కల గురించి ఆలోచించడం ఏంటని సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే నగరంలో రోడ్ల కూడా దెబ్బతిన్నాయని, మౌలిక వసతులపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ప్రజల అవసరాలు తీర్చే దిశగా జీవీఎంసీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని నగర వాసులు మండిపడుతున్నారు. పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధిపై చర్యలు తీసుకోకుండా కుక్కల పార్కు ఏర్పాటు చేస్తామనడం కరెక్ట్ కాదంటున్నారు.