గ్రేటర్ విశాఖ మరో ఘనత సాధించింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులతో చకచకా ముందుకెళుతూ దేశంలోని స్మార్ట్ నగరాల అభివృద్ధి జాబితాలో టాప్ సెవెన్లోకి దూసుకెళ్లింది. మరిన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు సాధించే దిశగా ముందుకెళుతోంది.
స్మార్ట్ సీటీ మిషన్లో భాగంగా విశాఖ దూసుకెళుతోంది. దేశంలోని స్మార్ట్ నగరాల అభివృద్ధి జాబితాలో ఒక ర్యాంక్ మెరుగుపరుచుకుని మరింత జోష్ తో ముందుకెళుతోంది. ప్రాజెక్టుల ఎంపిక, నిధులు ఖర్చు జరుగుతున్న విధానం మొదలైన అంశాలను పరిగణలోనికి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఓ జాబితాను రూపొందించింది. ఆ జాబితాలో జీవీఎంసీ అత్యత్తమ స్థానంలో నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. తొలిసారి ఏడో ర్యాంకును సొంతం చేసుకున్నట్లు తెలిపారు.
మరోవైపు విశాఖ నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా స్మార్ట్ సీటీ పరిధిలో కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ నూతన శోభ చేకూరేలా పనులు చేపడుతోంది. స్మార్ట్ సీటీలో భాగంగా జీవీఎంసీ పరిధిలో వెయ్యి కోట్లతో 50 ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటికే 296 కోట్ల విలువైన 29 ప్రాజెక్టులు పూర్తి కాగా,409 కోట్ల విలువైన 19 ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. కేవలం ఒకే రంగంలో అభివృద్ధి అనేది కాకుండా విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యాటకం, మౌళిక సదుపాయాలు కల్పించేలా జీవీఎంసీ కొత్త ఆలోచనలతో ముందుకెళ్తోంది.
2019 దేశంలోని స్మార్ట్ సిటీల జాబితాలో విశాఖ ఎనిమిదో స్థానంలో నిలిచింది. జీవిఎంసీ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తివుతుండటంతో ఏపీ స్మార్ట్ సీటీ మిషన్ కూడా మంచి స్థానంలో కొనసాగుతోంది. వచ్చే ఏడాదిలో మరిన్ని ప్రాజెక్టులు పూర్తి కానుండడంతో విశాఖ ఖ్యాతి మరింత పెరగనుంది.